గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By కుమార్ దళవాయి
Last Modified: సోమవారం, 8 ఏప్రియల్ 2019 (17:46 IST)

లగడపాటి కీలక వ్యాఖ్యలు... షాక్ కొడుతుందేమోనని పేరు చెప్పలేదు...

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన సందర్భంగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈరోజు ఉదయం ఆయన కాలినడకన కొండపైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో కొద్దిసేపు మాట్లాడారు.
 
ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు అనుభవజ్ఞులకే పట్టం కడతారని లగడపాటి రాజగోపాల్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్ర భవిష్యత్‌ రీత్యా అనుభవజ్ఞులైన నాయకుల అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అనుభవజ్ఞులైన, సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని లగడపాటి చెప్పారు. దూరదృష్టితో పాలించే వారిని ఎన్నుకుంటారని చెప్పారు. 
 
ఓటేసే ముందు అభివృద్ధి, సంక్షేమం రెండిటినీ ప్రజలు చూస్తారని చెప్పారు. మే 19న తుది విడత ఎన్నికల పోలింగ్‌ ముగిసిన వెంటనే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సర్వే ఫలితాలు వెల్లడిస్తానన్నారు. కాగా గత తెలంగాణ ఎన్నికల్లో లగడపాటి చెప్పిన జోస్యం తలకిందులైంది. అందుకే షాక్ కొడుతుందని పేరు చెప్పకుండా అనుభవజ్ఞులు అనే మాట మాత్రమే చెప్పి వదిలేశారు.
 
లగడపాటి చేసిన ఈ వ్యాఖ్యల్లో అనుభవజ్ఞులు అనే మాటను పదేపదే వాడటం, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అనుభవం ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు కావడంతో రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే అని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. దీనితో తెలుగుదేశం కార్యకర్తల్లో నూతనోత్సాహం వచ్చిందని ఆ పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు.