అదరహో అనిపించనున్న ఆంధ్రా వంటకాలు... బెజవాడలో ఏడు రోజులు...
తెలుగునాట సుప్రసిద్ద వంటకాలకు కొదవ లేదు. కాకుంటే అవి కనుమరుగవుతున్నాయి. తెలుగుదనం ప్రతిబింబించే వంటకాలను మరింతగా జనబాహుళ్యంలోకి తీసుకువెళ్లేలా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ నిరంతరం వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే విజయవా
తెలుగునాట సుప్రసిద్ద వంటకాలకు కొదవ లేదు. కాకుంటే అవి కనుమరుగవుతున్నాయి. తెలుగుదనం ప్రతిబింబించే వంటకాలను మరింతగా జనబాహుళ్యంలోకి తీసుకువెళ్లేలా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ నిరంతరం వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే విజయవాడ వేదికగా ఆంధ్రా ఫుడ్ ఫెస్టివల్‌ను నిర్వహించాలని ప్రభుత్వం భావించింది.
ప్రపంచ వ్యాప్తంగా భిన్న రకాల వంటకాలను ఆహార ప్రియులు స్వాగతిస్తున్నా, పోషక విలువలు, రుచుల పరంగా ఆంధ్రప్రదేశ్ వంటకాలు విభిన్నమైనవి. ఈ అంశాన్ని మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావటమే ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర పర్యాటక శాఖ ఈ వినూత్న కార్యక్రమాన్ని తీసుకుంది. పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా బాధ్యతలు చేపట్టిన తదుపరి పర్యాటక శాఖ పరంగా వివిధ పనులు వేగం పుంజుకోగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు సూచనల మేరకు ఈ ఆంధ్రా ఆహార పండుగలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
శాఖాహారం కావచ్చు, మాంసాహారం కావచ్చు... రాష్ట్ర ప్రజలకు ప్రీతిపాత్రమైన వంటకాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని బహుళ ప్రాచుర్యం పొందినవి కాగా, మరికొన్ని అంతగా పర్యాటకుల దృష్టిని ఆకర్షించలేక పోయాయి. ఈ లోటును భర్తీ చేయాలన్నదే పర్యాటక శాఖ ఉద్దేశ్యం అంటున్నారు ఆ శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా. తెలుగు సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్న మన ఆహారం గురించి నేటి తరంతో పాటు, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పర్యాటకులకు పరిచయం చేయాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టగా, ఇకపై సంవత్సరమంతా కార్యక్రమాలు నిర్వహిస్తామని పర్యాటక, భాషా, సాంస్కృతిక శాఖ కార్యదర్శి మీనా వివరించారు.
పోషక విలువలతో కూడిన తెలుగు వంటకాలను ప్రపంచ పర్యాటకులకు చేరువ చేసే క్రమంలో ఇప్పటికే సచివాలయంలో భారీ ఎత్తున ఆహార పండుగను నిర్వహించగా, దానికి కొనసాగింపుగా ఈ తరహా ఆహార పండుగలను జాతీయ, అంతర్జాతీయ స్థాయితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామన్నారు. నగరంలోని ది గేట్‌వే హోటల్‌లో జూన్ 8 నుండి 14వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుందని ఎపిటిఎ సిఇఓ, ఎపిటిడిసి ఎండి హిమాన్హు శుక్లా తెలిపారు.
పర్యాటక శాఖ నిర్వహించే ఈ వేడుకలో తెలుగుదనం ప్రతిబింబించే ముంత మసాలా రుచి చూడవచ్చు. శాఖాహారంలో దొండకాయ కొబ్బరి కూర రుచి చూస్తే వదిలిపెట్టరెవ్వరూ. తెలగపిండి, మునగాకు తాలింపు మజానే వేరు. మునగాకు పువ్వు కూర గురించి తెలిసిన వారు తక్కువనే చెప్పాలి. ఆయుర్వేద విలువల భరితం ఇది. కాకరకాయ ఉల్లికారం రుచి చూస్తే మళ్లి, మళ్లి నోరూరవలసిందే. అరటిపువ్వు కాంబినేషన్‌లో చేసే పెసరకూర రుచి, తింటే కాని అర్ధం కాదు. అందరికీ తెలిసిందే గుత్తి వంకాయ కమ్మదనం. ఇక ఉలవచారు మీగడతో రెండు ముద్దలు తిన్నా చాలు.
చింతచిగురు పప్పు, తోటకూర పప్పు, ఆనపకాయ పప్పు, ముక్కల పులుసు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విశేషాలు పొదిగిన ఆహారం ఆంధ్రులది. ఇక దంపుడు బియ్యం, పెసరమొలకల పలావ్ తింటే ఏ పరదేశీ అయినా ఇక్కడి పౌరసత్వం తీసుకోవాలసిందే. మెంతికూర టమోటా అన్నం, పుల్లట్లు, రాగిముద్ద, పన్నీరు గంటి కుడుములు గ్రామీణాంధ్రలో కనిపించే విశేష వంటకాలు. ఇక మాంసాహారం ముచ్చట చెప్పనక్కర లేదు. కొత్తిమీర కోడి మసాలా వాసనకే కడుపు నిండిపోతుంది. బొంగు చికెన్, గోంగూర మాంసం, దోసకాయ మాంసం రుచులు అంతర్జాతీయ పర్యాటకులకు చేరువ అయితే వీటి కోసమే వారు మళ్లి, మళ్లి రాకపోరు. మాంసాహార ప్రియులలో బీరకాయ రొయ్యల కూర, సొర పొట్టు కూరను స్వాగతించని వారే ఉండబోరు. తాటిబెల్లం ఉక్కరి రుచి చూడాలంటే ఎవరైనా తెలుగుదేశం రావలసిందే. ఒక కొబ్బరి మీగడ పాయసం గురించి ఎంత చెప్పినా తక్కవే.