చిత్తూరు జిల్లాలో టమోటా దొంగలు... రాత్రికి రాత్రే పంట మాయం
చిత్తూరు జిల్లాలో దొంగలు పడ్డారు. అయితే, వీరు చోరీ చేసింది ఇళ్లలో కాదు.. పంట పొలాల్లో. దేశ వ్యాప్తంగా టమోటా ధర ఆకాశాన్ని తాకుతోంది. కేజీ టమోటాలు పలు ప్రాంతాల్లో రూ.300 నుంచి రూ.400 మేరకు పలుకుతున్నాయి. ఈ పెరిగిన ధరలపై జనం గగ్గోలు పెడుతున్నారు. వందలాది రూపాయలు ఖర్చు చేసి టమోటాలు కొనుగోలు చేయలేని కొందరు చోరీలకు పాల్పడుతున్నారు.
తాజాగా చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం నెక్కుంది గ్రామ సమీపంలో రైతు ఉదయ్‌కుమార్ పొలంలో శుక్రవారం రాత్రి దుండగులు రూ.50 వేల విలువచేసే టమాటాలను రాత్రికి రాత్రే కోసుకెళ్లిపోయారు. ముప్పాతిక ఎకరంలో సాగు చేయగా.. శనివారం మూడో కోత కోయాల్సి ఉండగా శుక్రవారం రాత్రే అర ఎకరంలో దొంగతనం జరిగిందని బాధిత రైతు వాపోయారు. సుమారు 450 కిలోల టమాటాలు చోరీ అయ్యాయని.. వాటి విలువ రూ. 50 వేలు పైనే ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.