భర్త సేవ చేయడాన్ని చూసి తట్టుకోలేక భార్య ఆత్మహత్య
భార్య అనారోగ్యంతో ఉండగా భర్త సేవలు చేయడం చూసి ఆమె సహించలేక చనిపోయింది. అది జీర్ణించుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆదర్శ దంపతుల పేర్లు మురళీకృష్ణ (45), ప్రశాంతి(50). వీరికి 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. అప్పటి నుండి రామవరప్పాడు గోలి క్రిష్ణయ్యవీధిలో ప్రశాంతి వాళ్ల అక్క ఇంట్లోనే ఉంటున్నారు. పిల్లలు లేరన్న బాధను అధిగమించి ఎలాంటి మనస్పర్థలు లేకుండా జీవిస్తున్నారు. కానీ ఒక చిన్న రోగం వారిద్దరినీ విగత జీవుల్ని చేసింది. ఈ హృదయ విదారక ఘటన విజయవాడ శివారులోని రామవరప్పాడులో మంగళవారం చోటుచేసుకుంది.
ఏసీపీ అంకినేని ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం మచిలీపట్నంకు చెందిన గొట్టిపాటి మురళీకృష్ణ, విజయవాడ కృష్ణలంకకు చెందిన ప్రశాంతిలకు వివాహమైంది. కానీ పిల్లలు లేరు, మురళీకృష్ణ ఆటోనగర్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో వెహికల్ సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. గత కొద్దికాలంగా భార్య చల్ది అనే చర్మవ్యాధితో బాధపడుతోంది, ఎన్ని ఆసుపత్రులలో చూపించినా నయంకాలేదు. కాలం గడిచేకొద్ది ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది.
దాంతో భర్త తానే అన్ని పనులు చేసి విధులకు వెళుతుండేవాడు. రెండు రోజుల క్రితం భార్యకు ఆరోగ్యం బాగాలేదని, వచ్చి చూసి వెళ్లమని బంధువులకు కబురు పంపాడు. సోమవారం రాత్రి 11 గంటలకు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాడు. మంగళవారం ఉదయం 11 గంటలు దాటినా తలుపు తీయకపోవడంతో చుట్టుపక్కల వారు కిటికీలోంచి చూడగా మురళీకృష్ణ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉన్నాడు.
పోలీసులకు సమాచారం అందించడంతో వారు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని తాళం పగులకొట్టి లోపలికి వెళ్లారు. బెడ్‌రూమ్‌లో మంచంపై ప్రశాంతి విగతజీవిలా పడి ఉంది. ఎస్సై సుధాకర్ స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఇది ఆత్మహత్యా లేక ఎవరిపనైనా అయి ఉంటుందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవపరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో దొరికిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో నా భార్య అనారోగ్యం కారణంగా చనిపోయింది, తాను లేని ఈ లోకంలో నేనూ ఉండలేను అని వ్రాసి ఉంది. ఎవరేవరికి ఎంత అప్పు చెల్లించాలి, బంగారు నగల తాకట్టు వివరాలు వంటివి ఉన్నాయి.