శుక్రవారం, 4 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Updated : మంగళవారం, 2 ఆగస్టు 2016 (12:12 IST)

తిరుపతిలో బంద్‌ ఉద్రిక్తం... ఆగిన బస్సులు... వైకాపా నేతల మానవహారం...

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ తిరుపతిలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ, సిపిఐ చేపట్టిన బంద్‌ ఉద్రిక్తతకు దారితీసింది. ఉదయం 4 గంటల నుంచే తిరుపతి బస్టాండ్‌లోని బస్సులు ఎ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ తిరుపతిలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ, సిపిఐ చేపట్టిన బంద్‌ ఉద్రిక్తతకు దారితీసింది. ఉదయం 4 గంటల నుంచే తిరుపతి బస్టాండ్‌లోని బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. బస్సులన్నీ డిపోకే పరిమితమయ్యాయి. తిరుమలకు మాత్రం యధావిధిగా బస్సులను నడుపుతున్నారు. పూర్ణకుంభం సర్కిల్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ నాయకులు మానవహారం నిర్వహించి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
 
మరోవైపు సిపిఐ నాయకులు ఆర్టీసీ బస్టాండ్‌ ప్రధాన ద్వారం ముందు నిరసనకు దిగారు. కేంద్రప్రభుత్వం ఒక దెయ్యమంటూ వేషాలు వేసుకుని ఆందోళన నిర్వహించారు. ఆందోళన చేస్తున్న ఉద్యమకారులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు భూమన కరుణాకర్‌రెడ్డితో పాటు మరికొంతమంది నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీస్టేషన్‌కు తరలించారు. భూమన అరెస్టు సమయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసు వాహనాలకు అడ్డుగా వైసిపి నాయకులు పడుకున్నారు. మరోవైపు సిపిఐ నాయకులను కూడా పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. 
 
బంద్‌ కారణంగా తిరుమలకు వచ్చిన శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుమల నుంచి తిరుపతికి, తిరుపతి నుంచి తిరుమలకు బస్సులు నడుస్తున్నాయి కానీ, మిగిలిన ప్రాంతాలకు బస్సులు నడవకపోవడంతో భక్తులు బస్టాండ్‌లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.