1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: సోమవారం, 5 మార్చి 2018 (21:58 IST)

రూ. 149కే ప్రతి ఇంటికి టీవీ, నెట్, ఫోన్... మంత్రి పల్లె ప్రకటన

అమరావతి: ఈ నెల 5వ తేదీ సోమవారం ప్రారంభమైన ఏపీ శాసనసభ సమావేశాలు ఈ నెల 28వ తేదీ వరకు జరుగుతాయని ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథ రెడ్డి చెప్పారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద సోమవారం ఉదయం ఆయన మాట్లాడారు. సమావేశాలకు మధ్యలో 5 రోజులు సెలవులని చె

అమరావతి: ఈ నెల 5వ తేదీ సోమవారం ప్రారంభమైన ఏపీ శాసనసభ సమావేశాలు ఈ నెల 28వ తేదీ వరకు జరుగుతాయని ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథ రెడ్డి చెప్పారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద సోమవారం ఉదయం ఆయన మాట్లాడారు. సమావేశాలకు మధ్యలో 5 రోజులు సెలవులని చెప్పారు. గవర్నర్ ప్రసంగంపై జరిగే చర్చకు 7వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం ఇస్తారన్నారు. 8వ తేదీ ఉదయం 11.30 గంటలకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్‌ను ప్రవేశపెడతారని పేర్కొన్నారు. సమావేశాలు జరిగే కాలంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని, విజేతలకు బహుమతులు అందజేస్తామని చెప్పారు. 
 
గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలను వెల్లడించినట్లు తెలిపారు. 84 లక్షల మంది రైతులకు రూ.24 వేల కోట్ల రుణాలు మాఫి చేసినట్లు వివరించారు. ఈ విధంగా రద్దు చేయడం దేశంలోనే ఓ అపూర్వ ఘట్టం అన్నారు. దీంతో రైతుల తలరాతలు మారిపోయాయన్నారు. ఎంతోమంది ఎన్నో ఏళ్లుగా కంటున్న కలలు నదులు అనుసంధానం అని, పట్టిసీమ ద్వారా గోదావరి-కృష్ణా నదులను అనుసంధానం చేశారని చెప్పారు. 
 
ప్రభుత్వం చేపట్టిన పనుల ద్వారా రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. ఈ-ఆఫీస్, ఈ-ఫైల్స్ వంటి వాటి ద్వారా సాంకేతిక రంగంలో రాష్ట్రం ముందుకు దూసుకుపోతుందని చెప్పారు. వ్యాపార అనుకూలతలతో దేశంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని గుర్తు చేశారు. రూ.13.54 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా పారిశ్రామిక రంగం పురోభివృద్ధి సాధించనుందన్నారు. ఫైబర్ నెట్ ద్వారా రూ.149 లకే ప్రతి ఇంటికి టీవీ, నెట్, ఫోన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. 
 
రాష్ట్రంలో కోటి 42 లక్షల కుటుంబాలకు రేషన్ అందజేస్తున్నట్లు చెప్పారు. 50 లక్షల మందికి పెన్షన్ అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత నుంచి 24X7 విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. 12 లక్షల మంది పేదలకు ఇళ్లు కట్టించడానికి ప్రణాళికలు రూపొందించి, అమలు చేస్తున్నట్లు వివరించారు. సంక్షేమ పథకాల్లో చంద్రన్న బీమా ప్రముఖమైనదిగా పేర్కొన్నారు. రూ.16వేల కోట్ల రెవెన్యూ లోటు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు సామర్థ్యం వల్ల అభివృద్ధి సాధ్యమైందన్నారు. ఎన్నికల హామీలన్నిటిని నెరవేర్చినట్లు పల్లె రఘునాథ రెడ్డి తెలిపారు.