శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 30 జూన్ 2017 (10:43 IST)

వనజాక్షి గీత దాటలేదు.. చింతమనేనిపై చర్య తీసుకోవాల్సిందే...

కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దారు డి.వనజాక్షి గీత దాటలేదని ద్విసభ్య కమిటీ తేల్చింది. వనజాక్షి, టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యవహారంపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జగదీష్‌ చంద్ర శర్మ

కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దారు డి.వనజాక్షి గీత దాటలేదని ద్విసభ్య కమిటీ తేల్చింది. వనజాక్షి, టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యవహారంపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జగదీష్‌ చంద్ర శర్మ, ఐఏఎస్‌ అధికారి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌లతో కూడిన ద్విసభ్య కమిటీ విచారణ జరిపింది. ఈ కమిటీ నివేదిక రూపొందించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) దినేష్‌ కుమార్‌కు సమర్పించింది. దీనిని సీఎస్‌ ముఖ్యమంత్రికి పంపించారు.
 
ఈ నివేదికలో ఇసుక అక్రమ తవ్వకాలను వనజాక్షి అడ్డుకున్న తమ్మిలేరు ప్రాంతం ముసునూరు తహసీల్దారు పరిధిలోకే వస్తుంది. తహసీల్దారు తన పరిధికి చెందని ప్రాంతంలోకి వచ్చి అనవసర రాద్ధాంతం చేశారని చింతమనేని చేసిన వాదనలో నిజం లేదని ద్విసభ్య కమిటీ పేర్కొంది. చింతమనేని వందలాది మంది తీసుకెళ్లి దాడికి దిగడం తప్పని తెలిపింది. వనజాక్షి కూడా చట్టాన్ని తన చేతిలోకి తీసుకున్నట్లు వ్యవహరించి ఉండరాదు. పోలీసులకు, ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసి చర్యలు తీసుకుని ఉండాల్సిందని ఈ కమిటీ తన నివేదికలో తెలిపింది. 
 
కాగా, ముసునూరు మండలంలోని తమ్మిలేరులో ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ అనుచరులు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని ఫిర్యాదు రావడంతో మండల ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌ హోదాలో వెళ్లి అడ్డుకున్నందుకు ఆమె దాడికి గురైన విషయం విదితమే.