చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్ తిరస్కరించిన ఏసీబీ కోర్టు
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టు అయిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని హౌస్ కస్టడీలో ఉంచేలా ఆదేశించాలని ఆయన తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌కు విజయవాడలోని ఏసీబీ కోర్టు తిరస్కరించింది. రాజమండ్రి కేంద్ర కారాగారంలో భద్రత పటిష్టంగా ఉందని ఏసీబీ తరపు న్యాయవాదులు చేసిన వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి.. ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. మరోవైపు, చంద్రబాబు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
రాజమండ్రి సెంట్రల్ జైలులో భద్రత సరిగా లేదని, అందువల్ల హౌస్ కస్టడీలో ఉంచాలని కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, జైలులో ఆయనకు పూర్తి భద్రతను కల్పించామని, ఈ జైల్లో ఆయనకు ఎలాంటి ముప్పు లేదని సీఐడీ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు.
ముఖ్యంగా, చంద్రబాబు భద్రతకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశామని, ప్రత్యేక బ్యారక్ ఇచ్చామని కోర్టుకు సీఐడీ తెలిపింది. చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా, సీఐడీ తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డిలు ఈ హౌస్ కస్టడీ పిటిషన్‌పై సోమవారం సుధీర్ఘంగా వాదనలు వినిపించగా, ఇరు వాదనలు ఆలలకించిన న్యాయమూర్తి తీర్పును నేటికి వాయిదా వేశారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం చంద్రబాబు పిటిషన్‌ను తిరస్కరిస్తూ తీర్పు ఇచ్చారు. ఈ పిటిషన్ తిరస్కరించిన నేపథ్యంలో చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం గుంది.