బెజవాడలో రెచ్చిపోతున్న ఈవ్‌టీ(నే)జర్స్
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని బెజవాడలో ఈవ్ టీజర్స్ రెచ్చిపోతున్నారు. వీరి నుంచి అమ్మాయిలు, మహిళలకు వేధింపులు ఎక్కువైపోయాయి. ఈ తరహా పోకిరీలను ఆటకట్టించే విషయంలో పోలీసులు మెతక వైఖరి అవలంభిస్తుండటంతో వారు మరింతగా రెచ్చిపోతున్నారు.
ప్రధానంగా విజయవాడలోని బెంజి సర్కిల్ సమీపంలోని ప్రైవేట్ కళాశాలల విద్యార్థినులు సాయంత్రం అక్కడి బస్టాపులో ఇళ్లకు వెళ్లేందుకు వేచి ఉంటారు. ఆ సమయంలో అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్ద కొందరు పోకిరీలు అమ్మాయిలను నిత్యం వేధిస్తున్నారు. అలాగే, బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, మొగల్రాజపురం, వన్‌టౌన్ తదితర ప్రాంతాల్లో ఇలాంటి పోకిరీల బెడద రోజు రోజుకూ పెరుగుతోంది. వీరి బారి నుంచి తమకు రక్షణ కల్పించాలని విద్యార్థినులు వేడుకుంటున్నారు.
గడచిన రెండేళ్ళ కాలంలో విజయవాడ కమిషనరేట్ పరిధిలో మహిళలు, విద్యార్థినుల పట్ల, వేధింపులు, అసభ్యం, అశ్లీలంగా వ్యవహరించిన కేసులు 1,958 వరకు నమోదయ్యాయి. వీటిలో చాలావరకు కేసులు భార్యభర్తల మధ్య గొడవలకు సంబంధించినవే ఉన్నాయి. అలాగే, 90 శాతం పైగా రాజీ అయ్యారు. వీటిలో ఈవ్‌టీజింగ్ కేసులు, ఫొక్సో చట్టం కింద నమోదైన కేసులు, రేప్ అనంతరం హత్య చేసిన కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో న్యాయస్థానం 61 మందికి జైలు శిక్ష విధించింది. మరరో 626 మంది పోకిరీలకు కౌన్సెలింగ్ ఇచ్చింది.