బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 10 జులై 2023 (18:34 IST)

వలంటీర్లకు రూ.5 వేల జీతంతో ఊడిగం చేయిస్తున్నది ఎవరు?

pawan kalyan
వలంటీర్ వ్యవస్థను ఏపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ తాజాగా మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. వలంటీర్లకు రూ.5 వేల వేతనం ఇచ్చి ఊడిగం చేయిస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
ఆయన సాగిస్తున్న వారాహి విజయ యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఏపీ సర్కారు వాలంటీర్లు పేరుతో యువత జీవితాలు నాశనం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
5 వేల రూపాయల వేతనం ఇచ్చి వెట్టి చాకిరీ చేయించుకుంటుంది ఎవరు? 4 ఏళ్లుగా ఉద్యోగాలు కల్పించకుండా రూ.5 వేల జీతానికి ఊడిగం చేయిస్తూ బ్రతుకులు నాశనం చేసింది ఎవరు? అని నిలదీశారు. 
 
వాలంటీర్ అని మభ్యపెట్టి ప్రభుత్వ ఉద్యోగాల ఊసు ఎత్తకుండా మీ వయస్సు అర్హతలో 4 యేళ్లు నాశనం చేసి అర్హత లేకుండా చేసింది ఎవరు?ప్రభుత్వ పథకాల చేరవేత అని చెప్పి, మీ చేత ప్రజల డేటా సేకరిస్తుంది ఎవరు? మీ చేత డేటా సేకరించి, దానిని అసాంఘిక కార్యకలాపాలకు వాడుతున్నది ఎవరు? అంటూ ప్రశ్నించారు. 
 
మీ జీవితాల్లో ఎదిగే అవకాశాలు లేకుండా చేసి రూ.5 వేల దగ్గరే ఉంచింది ఎవరు? వాలంటీర్ వ్యవస్థతో వాలంటీర్ల జీవితాలు మారలేదు, వారిని అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకులు బాగుపడుతున్నారు అనేది వాస్తవం కాదా? వైసీపీ సభలు, సమావేశాలకు ప్రజల్ని తీసుకొచ్చే భాధ్యత మీపై వేశారా లేదా? 
 
మీ ప్రాంతంలో ప్రజలను మీ చేత భయపెట్టిస్తున్నరా లేదా? ఆలోచించండి గ్రామ వాలంటీర్లు, మీ జీవితాలలో వృద్ది లేకుండా చేస్తున్నాడు ఈ వైఎస్ జగన్ అని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.