శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: బుధవారం, 5 మే 2021 (23:40 IST)

ప్రజల ప్రాణాలకంటే ఎక్కువేంటి?: చంద్రబాబు

హైదరాబాద్‌: అతి తీవ్రమైన కరోనా సమస్యకు ఏపీ మంత్రివర్గ సమావేశంలో ప్రాధాన్యత కల్పించలేదని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. మంత్రివర్గ సమావేశం అజెండాలో 33వ అజెండాగా కరోనా నియంత్రణను చేర్చారని మండిపడ్డారు. రూ.వేలకోట్లు దుబారాకు ఖర్చు చేస్తూ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు మీన మేషాలు లెక్కిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ప్రజల ప్రాణాలు, ఆరోగ్యం కంటే ఈ ప్రభుత్వానికి ఎక్కువేంటని ప్రశ్నించారు. ప్రభుత్వానికి తగిన సూచనలు ఇవ్వాలనే బాధ్యతతోనే పొలిట్‌బ్యూరో సమావేశం నిర్వహించామన్నారు.
 
కొవిడ్‌ రెండో దశ చాలా ఉద్ధృతంగా ఉందని.. ఏపీ నుంచి వెళ్లేవారికి పొరుగు రాష్ట్రాలు నిషేదాజ్ఞలు అమలు చేస్తున్నాయన్నారు. తమ ప్రజలకు ఇబ్బంది వస్తుందనే ఆందోళనతో తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలు ఏపీ పట్ల ఆంక్షలను అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు. కొత్త స్ట్రెయిన్‌ ఎన్‌440కె కర్నూలులో ప్రారంభమై దేశవ్యాప్తంగా వ్యాపిస్తోందని నిపుణులు చెబుతుంటే.. దీనిపై అప్రమత్తంగా లేకుండా ఎన్‌440కె అసలు లేదని బుకాయిస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ పడకల కొరత లేదంటూ అసత్యాలు చెబుతున్నారని ఆరోపించారు. పార్టీ పరంగా కొవిడ్‌ బాధితులకు సేవలందిస్తున్నామని.. ఆన్‌లైన్‌ ద్వారా వైద్య సూచనలు అందజేస్తున్నట్లు చెప్పారు. ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ విధానం ఇచ్చిన ఫలితాలకు అనుగుణంగా ఇంకా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. ప్రభుత్వానికి ఎన్నో వనరులున్నాయని.. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉందని చంద్రబాబు అన్నారు.