కాల్ మనీ, సెక్స్ రాకెట్ బాబు అన్న రోజా... ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్
వైసీపీ నాయకులకు గుబులేనా...
కాల్ మనీ రాకెట్ బాబు, సెక్స్ రాకెట్ బాబు వంటి వ్యాఖ్యలు వైసీపీ ఎమ్మెల్యే రోజా చేశారన్న కారణంగా ఆమెను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల ప్రకటించడంతో వైసీపీ నాయకులు షాక్ తిన్నారు. సభలో రోజా ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంతకుముందు సభలో మాట్లాడుతూ అన్నారు.
ఆ తర్వాత దూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ... రోజా అసభ్యపదజాలం ఉపయోగించారనీ, ఆమెను సభ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గోరంట్ల కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాత మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ... ప్రతిపక్ష సభ్యులు కాల్ మనీ అంశాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. సభలో మహిళా ఎమ్మెల్యే అయిన రోజా కాల్ మనీ రాకెట్ బాబు, సెక్స్ రాకెట్ బాబు వంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రిపై చేశారనీ, ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు వారిని ఏడాది పాటు సస్పెండ్ చేయాలని స్పీకర్ కోడెలకు విజ్ఞప్తి చేశారు. ఆ వెంటనే స్పీకర్ సభ్యుల అభిప్రాయం తీసుకుని రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.