పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?
రోజువారీ వ్యాయామం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఐతే స్త్రీల విషయంలో ప్రత్యేకించి పీరియడ్స్ సమయంలో అలసిపోయినట్లు అనిపిస్తే కొన్ని వ్యాయామాలు చేయకుండా వుండటమే మంచిది.
తీవ్రమైన వ్యాయమం చేయడం వల్ల భారీ ఋతు ప్రవాహానికి దారితీస్తుంది కనుక అలా వ్యాయామం చేయరాదు. మొదటి రోజు నుండే బహిస్టు నొప్పి ఎదుర్కొంటుంటే మొదటి రెండు నుండి మూడు రోజులు బరువులు ఎత్తుతూ చేసే డంబెల్స్ వంటివి చేయకూడదు. శరీరం కోలుకోవడానికి సమయం ఇవ్వండి. మీరు అలసిపోయినట్లు అనిపిస్తే ఎలాంటి వ్యాయామంలో పాల్గొనవద్దు.
పీరియడ్స్ సమయంలో యోగా కదలికలు చేయడం మంచిది. ఐతే తలక్రిందులుగా చేసే విలోమ యోగా భంగిమలు ఈ సమయంలో చేయకూడదు. ఈ సమయంలో క్లిష్టమైనటువంటి యోగా భంగిమలు చేయడాన్ని ఆపేయాలి. కటి భాగంలో నొప్పి ఉన్న మహిళలు స్క్వాట్‌లు చేయకూడదు, ఎందుకంటే ఇది అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
స్కిప్పింగ్, జంపింగ్ వంటి వ్యాయామాలు కూడా చేయడం తాత్కాలికంగా ఆపాలి. ఇవి ఋతు ప్రవాహాన్ని పెంచుతాయి. అందువల్ల తేలకపాటి వ్యాయామం చేయాలి.