శుక్రవారం, 21 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 21 నవంబరు 2025 (09:12 IST)

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

amala
ఒకప్పటి హీరోయిన్, జంతు ప్రేమికురాలు అక్కినేని అమల తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా అందరూ తననే నిందిస్తున్నారంటూ మండిపడ్డారు. దేశంలో ఎక్కడ ఎవరిని వీధికుక్క కరిచినా, సోషల్ మీడియాలో చాలామంది తననే నిందిస్తూ దూషిస్తున్నారని ఆమె వాపోయారు. ఇటీవల ఓ పాడ్‌క్యాస్ట్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 
 
ఇందులో ఆమె మాట్లాడుతూ, తాను మొదటి నుంచి జంతువులను ప్రేమించే వ్యక్తినని, వాటిని హింసించవద్దని మాత్రమే చెబుతానని అమల తెలిపారు. కేవలం ఆ ఒక్క కారణంతోనే, వీధికుక్కల సమస్యకు తనలాంటి వారే కారణమంటూ కొందరు నిందిస్తున్నారని పేర్కొన్నారు. ఎక్కడ కుక్కల దాడి జరిగినా తన పేరును ట్రెండ్ చేస్తూ విమర్శలు చేయడం బాధ కలిగిస్తోందని ఆమె భావోద్వేగానికి గురయ్యారు.
 
గతంలో దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులపై పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జంతు ప్రేమికులపై సోషల్ మీడియాలో తరచూ విమర్శలు వస్తుంటాయి. జంతువుల పట్ల ఎంతో సానుభూతితో వ్యవహరించే అమల, ఈ విషయంలో తనను అనవసరంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.