శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: గురువారం, 22 జులై 2021 (19:21 IST)

ప్రతి ధాన్యపు గింజకూ డబ్బు చెల్లించాలి: పవన్‌ కళ్యాణ్

ఏపీలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు, లెక్కలను ప్రభుత్వం గోప్యంగా ఎందుకు ఉంచుతోందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. ప్రభుత్వ వెబ్‌సైట్‌ నుంచి ఈ వివరాలను ఎందుకు తొలగించారో రైతులకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ధాన్యంపై ప్ర‌శ్నిస్తూ, పవన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. రైతులకు ధాన్యం సొమ్ములు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ నెలాఖరులోగా ప్రతి గింజకూ డబ్బు చెల్లించాలని.. లేనిపక్షంలో రైతుల కోసం పోరాడతామని హెచ్చరించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి నెలలు గడుస్తున్నా డబ్బులెందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.

ప్రభుత్వం రైతులకు రూ.3 వేల కోట్లకు పైగా బకాయి పడిందని పవన్‌ అన్నారు. రబీ సీజన్లో కొనుగోలు చేసిన ధాన్యానికి ఉభయ గోదావరి జిల్లాల్లోనే రూ.1800 కోట్ల వరకూ బకాయిలు ఉన్నాయని ఆక్షేపించారు. గతంలో రైతుల కోసం కాకినాడలో ‘రైతు సౌభాగ్య దీక్ష’ చేపడితేనే ప్రభుత్వం దిగి వచ్చి రైతులకు సొమ్ములు జమ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

రబీ డబ్బులు వస్తేనే ఈ సీజన్లో పంటకు పెట్టుబడి ఉంటుందన్నారు. బకాయిల కారణంగా కోనసీమలోని గ్రామాల్లో రైతులు పంట వేయబోమని క్రాప్ హాలిడే ప్రకటించారని పవన్‌ గుర్తు చేశారు. జొన్న, మొక్క జొన్న కొనుగోలు విషయంలోనూ రైతులను పార్టీలవారీ విడదీయడం దురదృష్టకరమని పవన్‌ కల్యాణ్‌ దుయ్యబట్టారు.

అధికార పార్టీకి మద్దతుగా ఉన్నవారి నుంచే పంటను కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పండించే పంటకు, తినే తిండికీ పార్టీ రంగులు పులమడం దిగజారుడుతనమేనని పవన్‌ విమర్శించారు. నకిలీ విత్తనాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. జనసేన రైతుల పక్షాన ఉంటుందని.. వారి కోసం నిరంతరం పోరాడుతుందని పవన్ క‌ల్యాణ్ పేర్కొన్నారు.