యేడాదిలో ఏపీ సీఎంగా భారతి.. అలా చేస్తే రాష్ట్రం శ్మశానమే : జేసీ దివాకర్
మరో యేడాదికాలంలో నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్. భారతి పగ్గాలు చేపడుతారని టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి జోస్యం చెప్పారు. ఆయన బుధవారం మందడంలో శాంతియుతంగా దీక్ష చేస్తున్న అమరావతి రైతులకు తన సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన రైతులనుద్దేశించి మాట్లాడుతూ, 'చంద్రబాబుపై నమ్మకం ఉంది కాబట్టి ఆయన ఏం చెప్పినా చేస్తాం. జగన్ నమ్మకం పోగొట్టాడు కాబట్టే పరిశ్రమలు వెళ్లిపోయాయి. సంవత్సరంలోపు భారతి సీఎం కాబోతుంది. అమరావతే రాజధాని అని గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. దీన్ని రాజధాని కాదని చెప్పడానికి తాతలు దిగిరావాలి. మనిషికి తల ఎంత ముఖ్యమో రాజధానికి సెక్రటేరియట్, అసెంబ్లీ అంతే ముఖ్యం. జగన్.. తాతకు దగ్గులు నేర్పించొద్దు' అంటూ మండిపడ్డారు.
అంతేకాకుండా, 'అమరావతిలో కేవలం కమ్మ వాళ్లే భూములు కొనలేదు. విశాఖలో వైసీపీ నేతలు భూములు కొన్నారు. 7 నెలలుగా విజయసాయిరెడ్డి విశాఖలోనే తిష్టవేశాడు. ఒక కులంపై, వ్యక్తిపై ద్వేషంతో ఇలా చేయడం సరికాదు. ఎన్నికల్లో జగన్‌కు కేసీఆర్ ఆర్థిక సాయం చేశాడు.. మన రక్తాన్ని పీల్చి జగన్.. కేసీఆర్‌కు రెట్టింపు చెల్లించాడు. రాజధానిని శ్మశానం అని మంత్రి బొత్స అన్నాడు. నిజంగా 3 రాజధానులు ఏర్పడితే రాష్ట్రం శ్మశానమే' అని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.