శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 24 ఏప్రియల్ 2017 (05:36 IST)

విషాద సమయంలోనూ జై జగనా...పరామర్శల్లోనూ రాజకీయమే అయితే పోయేది నేతల పరువే..

నాయకులకు ఎప్పుడు జై కొట్టాలో ఎప్పుడు కొట్టకూడదో కార్యకర్తలకు తెలియకపోతే, నాయకత్వం సందర్భ అసందర్భాలపై తగు శిక్షణను ముందుగా ఇవ్వకపోతే అవమానం, అప్రతిష్ట కలిగేది నాయకులకే అనేది జగమెరిగిన సత్యం. పెళ్లిదగ్గర, చావు దగ్గర తప్పు మాటలు మాట్లాడితే ఫలితం ఎలా ఉంట

నాయకులకు ఎప్పుడు జై కొట్టాలో ఎప్పుడు కొట్టకూడదో కార్యకర్తలకు తెలియకపోతే, నాయకత్వం సందర్భ అసందర్భాలపై తగు శిక్షణను ముందుగా ఇవ్వకపోతే అవమానం, అప్రతిష్ట కలిగేది నాయకులకే అనేది జగమెరిగిన సత్యం. పెళ్లిదగ్గర, చావు దగ్గర తప్పు మాటలు మాట్లాడితే ఫలితం ఎలా ఉంటుందని చెప్పే కథలు తెలుగులో చాలానే ఉన్నాయి. విషాదం మూర్తీభవించిన వాతావరణంలోకి వెళ్లేప్పుడు కనీస ఇంగిత జ్ఞానం లేకుండా వ్యవహరించి జగన్ పరువు పొగొట్టారు వైకాపా కార్యకర్తలు. 
 
విషయానికి వస్తే. చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద రెండు రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలను వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ ఆదివారం పరామర్శించారు. ప్రతిపక్ష నేతగా ఘోరప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఓదార్చడానికి మునగలపాలెంలో పర్యటించిన జగన్‌‌కి చేదు అనుభవం ఎదురైంది. ఇసుక లారీ ప్రమాదంలో అనూహ్యంగా మరణించిన మృతుల కుటుంబాలను జగన్ పరామర్శించి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జగన్‌ వెంట స్థానిక వైకాపా నేతలు ఉన్నారు.
 
ఇంతవరకు బాగానే ఉంది కానీ,  జగన్‌ పర్యటన సందర్భంగా వైకాపా నేతలు ప్రదర్శించిన అత్యుత్సాహం గ్రామస్థులను తీవ్ర ఆగ్రహంలో ముంచెత్తింది. జగన్‌ గ్రామంలోకి వస్తున్న సమయంలో వైకాపా కార్యకర్తలు తామెందుకు వచ్చాం. అక్కడి పరిస్థితి ఏమిటి అనే విషయం కూడా పట్టించుకోకుండా  ఈలలు వేస్తూ జై జగన్‌ అంటూ నినాదాలు చేశారు. 
 
దీంతో మునగల పాలెం గ్రామస్థులు తీవ్ర నిరసన తెలిపారు. ‘పరామర్శకు వచ్చారా.. వైకాపా మీటింగ్‌కు వచ్చారా. మీ పరామర్శలు మాకొద్దు. ఇక్కడి నుంచి వెళ్లిపోండి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్థానిక వైకాపా నేతలు గ్రామస్థులకు క్షమాపణ చెప్పారు.