నోట్ల రద్దు మంచోచెడో తెలియదు.. కానీ పరిస్థితి మాత్రం దయనీయంగా ఉంది : వైఎస్.జగన్
దేశంలో పెద్ద కరెన్సీ నోట్ల రద్దుపై వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి తొలిసారి స్పందించారు. ఈ నోట్ల రద్దు నిర్ణయం మంచి జరుగుతుందా.? చెడు జరుగుతుందా? అనే విషయాన్ని పక్కనపెడితే... ప్రస్తుతం బయట పరిస్థితులు
దేశంలో పెద్ద కరెన్సీ నోట్ల రద్దుపై వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి తొలిసారి స్పందించారు. ఈ నోట్ల రద్దు నిర్ణయం మంచి జరుగుతుందా.? చెడు జరుగుతుందా? అనే విషయాన్ని పక్కనపెడితే... ప్రస్తుతం బయట పరిస్థితులు మాత్రం మరింత దయనీయంగా ఉన్నట్టు ఆయన వ్యాఖ్యానించారు.
తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న జగన్ బుధవారం రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా 'బ్లాక్ మనీని అరికడుతున్నాం. ‘మీ అభిప్రాయం ఏమిటి?’ అని ఏ సామన్యుడిని అడిగినా.. మంచిదనే చెబుతాడు. నిజంగానే వ్యవస్థ బాగుపడాలంటే.. బ్లాక్ మనీని అరికట్టగలిగితే మంచిదే కదా అనుకుంటాం.' అని జగన్ అన్నారు.
'మోడీగారు ఆరోజు ప్రకటన చేసేటప్పుడు కూడా కరప్షన్‌లో నుంచి వస్తున్న బ్లాక్ మనీని, బ్లాక్ మార్కెటింగ్ వల్ల వస్తున్న బ్లాక్ మనీని, డ్రగ్ ట్రాఫికింగ్ వల్ల వస్తున్న బ్లాక్ మనీని, మనీ లాండరింగ్ వల్ల వస్తున్న బ్లాక్ మనీని, ట్రాఫికింగ్ అండ్ కౌంటఫిట్ నోట్ల వల్ల వస్తున్న బ్లాక్ మనీని పూర్తిగా అరికట్టే కార్యక్రమం చేస్తామని ప్రకటన చేశారు. వ్యవస్థ నుంచి బ్లాక్ మనీ పోతుందని అందరూ కూడా మంచి నిర్ణయమే అనుకున్నాం. మనమైతే అందరూ సమాన్యులమే. వాళ్లు నిర్ణయం తీసుకుని మనకు చెబుతారు. మనమంతా ఇటువైపు రిసీవింగ్ ఎండ్‌లో ఉన్నాం.
ప్రతిపక్షం అంటే ప్రజల గొంతును వినిపిస్తుంది. అధికార పార్టీ నిర్ణయాలతో ప్రతిపక్షానికి సంబంధం ఉండదు. కామన్ మ్యాన్‌గా మనమంతా ఈ పక్క చూస్తుంటాం. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా అనే విషయాన్ని ప్రతిపక్షం తెలియజేస్తుంది. ఇవాళ మాత్రం పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉంది. కేంద్రం నిర్ణయం వల్ల సంతోషంగా ఉన్నామని ప్రజలెవరూ చెప్పే పరిస్థితిలో లేరు' అని ఆయన వ్యాఖ్యానించారు.