సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 మే 2020 (17:29 IST)

నాన్‌స్టాప్ బస్సు సర్వీసులు : అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను తొలుత ప్రారంభించాలని ఉన్నతాధికారులకు సలహా ఇచ్చారు. ముఖ్యంగా, బస్సు మొదలయ్యే స్థానం నుంచి చేరుకునే స్థానం వరకు మధ్యలో ఎవరినీ ఎక్కించుకోరాదని సూంచారు. అంతేకాకుండా, బస్సులో ప్రయాణించే ప్రతి ఒక్కరి వివరాలను సేకరించాలని, అలాగే, బస్సులో దిగిన తర్వాత ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. 
 
మే 18వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు లాక్డౌన్‌ను పొడగిస్తూ కేంద్రం ఆదేశాలు జారీచేసింది. అయితే, లాక్డౌన్ నిబంధనలు సడలిస్తూ, హాట్ స్పాట్లు, కంటైన్మెంట్ జోన్ల వెలుపల బస్సులు, ఇతర వాహనాలు నడుపుకునే వెసులుబాటును కల్పించింది. దీనిపై ఏపీ ప్రభుత్వం యంత్రాంగం తీవ్ర కసరత్తు జరుపుతోంది.
 
ఇందులోభాగంగా, సీఎం జగన్..  మంత్రులు, అధికారులతో ఉన్నతస్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని సూచనలు చేశారు. తొలుత అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులతో మొదలుపెట్టి క్రమంగా రాష్ట్రంలోనూ బస్సులు తిప్పాలని సూచించారు. ప్రధానంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఏపీకి చెందినవారు ఇంకా ఉన్నందున వారిని తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని, దశల వారీగా సర్వీసులు పెంచుకుంటూ పోవాలని నిర్ణయం తీసుకున్నారు.
 
ఒక నగరంలోని బస్టాండ్ నుంచి గమ్యస్థానంలోని బస్టాండ్ వరకు సర్వీసులు నడపాలని, మధ్యలో ఎవరినీ ఎక్కించుకోరాదని భావిస్తున్నారు. బస్టాండులో ప్రయాణికులు దిగిన తర్వాత కరోనా పరీక్షలు నిర్వహించాలని, బస్సు ఎక్కిన ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. 
 
ఎక్కడ ఎక్కింది, ఎక్కడికి వెళుతున్నారన్నదానిపై స్పష్టమైన వివరాలు సేకరించలని తెలిపారు. ఆపై, రాష్ట్రంలోనూ భౌతిక దూరం పాటిస్తూ బస్సు సర్వీసులు నడపాలని సూచించారు. సగం సీట్లు మాత్రమే నింపి బస్సులు నడపాలని స్పష్టం చేశారు. బస్సు సర్వీసులు నడిపేందుకు సమగ్ర రీతిలో విధివిధానాలు రూపొందించాలని నిర్ణయించారు.