శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 ఏప్రియల్ 2021 (17:08 IST)

సాక్షి మీడియాపై షర్మిల సీరియస్.. కేసీఆర్.. నీ ఛాతీలో ఉన్నది.. గుండెనా.. బండనా..!

ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల సాక్షి మీడియాపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌లో దీక్షకు దిగారు. అయితే దీక్ష సందర్భంగా వైఎస్ షర్మిల సాక్షి మీడియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. లైవ్‌లో ఉండగానే సాక్షి కవరేజ్ మాకొద్దని.. మీరు వెళ్లిపోండని వ్యాఖ్యానించారు. దీంతో అక్కడ ఉన్న అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. 
 
మీరెలాగూ మాకు కవరేజ్ ఇవ్వరు.. వెళ్లిపోవాలని కెమెరామెన్‌కు షర్మిల చెప్పారు. దీంతో పక్కనే ఉన్న విజయమ్మ షర్మిలను వారించారు. షర్మిల చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. మరోవైపు నిరుద్యోగులకు మద్దతుగా ఇందిరాపార్క్‌లో షర్మిల 72 గంటలపాటు దీక్షకు దిగారు. 
 
నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు బలవన్మరణానికి పాల్పడుతుంటే దున్నపోతు మీద వాన పడినట్లు సీఎం కేసీఆర్ తీరు ఉందని వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఉద్యోగ దీక్షలో షర్మిల మాట్లాడుతూ.. 40 లక్షల మంది నిరుద్యోగులు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. కొందరు యువకులు ఉద్యోగాలు రావని నిరాశతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 
 
కేసీఆర్ పాలనలోనే ఇంతమంది యువకులు చనిపోతుంటే కేసీఆర్‌కి కన్పించడం లేదా..? అంటూ షర్మిల తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేసీఆర్.. నీ ఛాతీలో ఉన్నది.. గుండెనా.. బండనా..! ఈ పరిస్థితి మారాలి అని అన్నారు. అంతేకాదు, తెలంగాణ యువతకు ఉద్యోగాల కోసం 72 గంటలు దీక్ష కొనసాగిస్తా. 4 వ రోజు నుంచి జిల్లాల వారీగా ర్యాలీలు చేపడతాం అంటూ కేసీఆర్ సర్కారుకి ప్రశ్నల వర్షం కురిపించారు షర్మిల.