ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అయోధ్య రామాలయం
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 మే 2023 (14:44 IST)

స్నేహితులతో పందెం వేసి ఓడిపోయాడు.. డబ్బులు చెల్లించలేక ఆత్మహత్య

suicide
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో ఓ విషాదం చోటుచేసుకుంది. తన స్నేహితులతో కలిసి క్రికెట్ పందెం కాసిన ఓ యువకుడు.. ఓ పందెంలో ఓడిపోవడంతో స్నేహితులకు డబ్బులు చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం నార్లగూడ తండాలో గురువారం వెలుగుచూసింది. 
 
పోలీసుల కథనం మేరకు.. తండాకు చెందిన అంగోతు అమర్, సువర్ణ అనే దంపతులు దిన కూలీలు. వీరి రెండో కుమారుడు ప్రకాశ్(19) ఇంటర్ చదివి ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నాడు. బుధవారం రాత్రి పంజాబ్, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ పోరులో పంజాబ్ గెలుస్తుందని ప్రకాశ్ తన స్నేహితులతో వేలాది రూపాయల్లో బెట్టింగ్ కాశాడు.
 
కానీ, ఈ మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించింది. దీంతో ఉదయానికల్లా డబ్బులు చెల్లించాలని స్నేహితులు పట్టుబట్టారు. డబ్బులెలా చెల్లించాలో తెలియక తీవ్ర ఆందోళనకు గురైన ప్రకాశ్ ఇంట్లోనే ఉరేసుకున్నాడు. పందెం తమ కుమారుడిని బలిదీసుకోవడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. అతనితో పందెం వేసిన స్నేహితులెవరు? ఎంతమేరకు పందెం కట్టారనే విషయాలపై ఏసీపీ కుషాల్కర్ ఆధ్వర్యంలో సీఐ నవీన్ కుమార్ విచారణ జరుపుతున్నారు.