గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 జనవరి 2023 (10:37 IST)

అనాథ వ్యక్తికి బీమా చేయించి చంపేశారు.. ఎక్కడ?

murder
తెలంగాణ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ అనాథ వ్యక్తి పేరుమీద బీమా చేయించి, ఆ తర్వాత ఆ వ్యక్తిని చంపేశారు. పిమ్మట రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టుగా నమ్మించే ప్రయత్నం చేసిన నిందితులు చివరకు పోలీసులకు చిక్కి జైలు ఊచలు లెక్కిస్తున్నారు. ఫరూక్ నగర్ మండలం మొగలిగిద్ద సమీపంలో యేడాది క్రితం ఈ ఘటన జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం వివరాలను పరిశీలిస్తే,
 
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడతండాకు చెందిన బోడ శ్రీకాంత్ అనే వ్యక్తి మోసాలకు పాల్పడుతూ జల్సా జీవితానికి అలవాటుపడ్డాడు. హైదరాబాద్ శివారు మేడిపల్లికి చెందిన భిక్షపతి (34) అనే వ్యక్తి శ్రీకాంత్ వద్ద డ్రైవరుగా పని చేస్తున్నాడు. అనాథ అయిన భిక్షపతిపై శ్రీకాంత్ ఓ బ్యాంకులో రూ.50 లక్షలకు బీమా చేయించాడు. ఆ తర్వాత అదే బ్యాంకులో అతని పేరుపై రూ.52 లక్షలు రుణం తీసుకుని ఓ ఇంటిని కూడా కొనుగోలు చేశాడు. 
 
అన్ని పత్రాల్లో నామినీగా శ్రీకాంత్ తన పేరును నమోదు చేయించుకున్నాడు. ఆ తర్వాత బీమా సొమ్ముపై కన్నేసిన శ్రీకాంత్.. భిక్షపతిని హత్య చేయాలని ప్లాన్ వేశాడు. ఇందుకోసం, మల్కాజిగిరి పోలీస్ స్టేషనులో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేసే మోతీలాల్‌తో పాటు తన వద్ద పని చేసే సతీష్, సమ్మన్నలకు డబ్బు ఆశ చూపి, వారిని కూడా తన కుట్రలో భాగస్వాములు చేశాడు. 
 
ఆ తర్వాత హెడ్ కానిస్టేబుల్ మోతీలాల్ ప్లాన్ ప్రకారం గత 2021 డిసెంబరు నెలలో భిక్షపతిని కారులో ఎక్కించుకుని షాద్ నగర్ శివారు ప్రాంతమైన మొగలిగిద్దవైపు వెళ్లారు. అక్కడ మద్యంసేవించి హాకీ స్టిక్‌తో దాడి చేసి హత్య చేశారు. శవాన్ని రోడుపై పడేసి రెండుసార్లు కారును పైనుంచి పోనిచ్చారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు అనుమానాస్పద కేసులో నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
అయితే, పోస్టుమార్టంలో మాత్రం భిక్షపతి హత్యకు గురైనట్టు తేలింది. మరోవైపు, భిక్షపతి పేరున చేసిన బీమా డబ్బుల కోసం శ్రీకాంత్ తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. దీంతో బీమా సంస్థ నిర్వాహకులు రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వివరాల కోసం పోలీసులను సంప్రదించారు. దీంతో పోలీసులకు క్లూ లభించినట్టయింది. 
 
ఆ తర్వాత లోతుగా విచారణ చేయగా, బీమా డబ్బుకోసం ప్రయత్నిస్తున్న శ్రీకాంత్‌కు, మృతునితో ఎలాంటి రక్త సంబంధం లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో వారు రంగంలోకి విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సోమవారం నిందితులందరినీ అరెస్టు కోర్టులో హాజరుపరిచారు.