గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 24 నవంబరు 2020 (15:31 IST)

కరోనావైరస్: దిల్లీని ఈ చలికాలం కోవిడ్ సెంటర్‌గా మార్చేస్తుందా?

"గత నాలుగు నెలలుగా కోవిడ్ హాస్పిటల్స్‌లో హెల్త్‌కేర్ వర్కర్లు ఎంతో శ్రమపడుతున్నారు. ఇన్నాళ్లకు రోజువారీ కొత్త వైరస్‌ల సంఖ్య తగ్గింది" అని డాక్టర్ ఫరా హుసేన్ అక్టోబర్ 14న ఒక ట్వీట్ చేసారు. కానీ, నెల తిరిగేలోపు పరిస్థితి తారుమారైపోయింది. డా. హుసేన్ దిల్లీలోని అతి పెద్ద కోవిడ్ ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ విభాగంలో పనిచేస్తున్నారు.

 
"నిజంగానే మనం కష్టకాలం దాటిపోయాం అనుకున్నాను. కానీ శీతాకాలం కరోనావైరస్ వ్యాధిని తిరగబెట్టింది" అని డా. హుసేన్ తెలిపారు. శీతాకాలం చలి రోజురోజుకూ పెరుగుతుండడంతో దిల్లీ ఇంఫెక్షన్లకు కేంద్రంగా మారుతుందేమోనని డాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. నవంబర్ ప్రారంభంనుంచీ ఇప్పటివరకూ దేశ రాజధానిలో 1,28,000 కన్నా ఎక్కువ కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నవంబర్ 12వ తేదీన రికార్డు స్థాయిలో 8,593 కేసులు నమోదయ్యాయి. కోవిడ్ వ్యాప్తి మొదలయిన దగ్గరనుంచీ ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసుల సంఖ్య ఇదే.

 
మిగతా రాష్ట్రాలన్నిటికన్నా ఎక్కువగా దిల్లీలో రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకూ మొత్తం 5,00,000 పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం నాడు దిల్లీలో అత్యధికంగా 131 కోవిడ్ మరణాలు సంభవించాయి. ఇప్పటివరకూ మొత్తం మరణాలు 8,300గా నమోదయ్యాయి. పరీక్షల్లో పాజిటివ్ వస్తున్న రేటు 12% ఉంటూ ఆందోళన కలిగిస్తోంది. ఇది జాతీయ సగటుకన్నా మూడు రెట్లు ఎక్కువగా ఉంది. కోవిడ్ కేసులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. ఐసీయూల్లో పడకలు ఖాళీ ఉండట్లేదు.

 
"బెడ్స్ దొరకడం చాలా కష్టంగా ఉంది. మా కుటుంబలో ఎవరికైనా కావాలన్నా కూడా బెడ్ దొరకడం అసాధ్యంగా తోస్తోంది. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది" అని మణిపాల్ హాస్పిటల్‌లో పని చేస్తున్న డా. హర్జీత్ సింగ్ భాటీ తెలిపారు. "మా ఆస్పత్రిలో బెడ్స్ అన్నీ నిండిపోయాయి. నా సహోద్యోగి వికాస్ పాండే తన బంధువుల్లో ఒకరిని అడ్మిట్ చెయ్యడానికి ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ కోవిడ్ బెడ్స్ కోసం 250 వెయిటింగ్ లిస్ట్ ఉంది. వేసవికాలం కన్నా పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారయ్యింది" అని డా. భాటీ తెలిపారు.

 
ఆఫీసులు, మార్కెట్లు, ఫ్యాక్టరీలన్నీ తెరిచారు, పండుగ సీజన్ కావడంతో వేడుకలు జరుపుకుంటున్నారు... వీటన్నిటివల్లా వైరస్ ఉప్పెనలా వ్యాపిస్తోంది. వీటికి తోడు రోజురోజుకూ తగ్గిపోతున్న ఉష్ణోగ్రతలు, పెరుగుతున్న కాలుష్యం పరిస్థితిని మరింత దిగజార్చేస్తున్నాయి. డా. హుసేన్ పని చేస్తున్న లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ ఆస్పత్రిలో ఉన్న 2,000 బెడ్స్ కూడా నిండిపోయాయి.

 
వారందరికీ ఆక్సిజన్ ఎక్కిస్తూ, యాంటీ-వైరల్ మందులు, స్టెరాయిడ్స్, ప్లాస్మా, రక్తాన్ని పలుచన చేసే మందులు, ఇన్ఫెక్షన్ తీవ్రం అవ్వకుండా ఉండేందుకు స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. ప్రాణాల మీదకొచ్చే కేసులు తక్కువగానే ఉండొచ్చుగానీ కోలుకున్నవారు లాంగ్ కోవిడ్‌తో బాధపడే అవకాశాలున్నాయని డాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. దీర్ఘకాలిక కోవిడ్ లేదా లాంగ్ కోవిడ్‌లో బ్రెయిన్, గుండెకు సంబంధించిన వ్యాధులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, కిడ్నీలు, పేగులలో ఇంఫెక్షన్, కాలేయం, చర్మ సంబంధిత వ్యాధులు బాధించొచ్చు.

 
"ఈసారి రోగులు గుంపులుగా వస్తున్నారు. కుటుంబ సభ్యులందరికీ, స్నేహితులందరికీ ఒకేసారి కోవిడ్ సోకుతోంది. పండుగ సంబరాలు, వేడుకలకు హాజరయినవారందరికీ కోవిడ్ సోకుతోంది. పెళ్లైన జంట లేదా తల్లీ కొడుకులూ ఒకేసారి ఐసీయూలో అడ్మిట్ అవ్వడం చూస్తున్నాను" అని డా. హుసేన్ తెలిపారు. అంతేకాకుండా, ఈసారి వయసు తక్కువగా ఉన్నవాళ్లల్లో కూడా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని డాక్టర్లు అంటున్నారు.

 
తీవ్రంగా వ్యాధి సోకినవారిలో 55 పైబడినవారు 70% ఉన్నారు గానీ 25-45 మధ్య వయసుగల వాళ్ల సంఖ్య కూడా పెరుగుతోంది. పైగా వీళ్లల్లో వైరస్ అధిక మోతాదులో కనిపిస్తోంది. బహుసా వ్యాధి సోకినవారిని మళ్లీ మళ్లీ కలవడం వలన ఇలా జరుగుతూ ఉండొచ్చు. చిన్నవాళ్లకి వ్యాధి సోకే అవకాశం తక్కువ అనుకుని యువత కాస్త ఫ్రీగా బయట తిరుగుతున్నారు. కానీ వీరంతా సూపర్-స్ప్రెడర్స్" అని డా. హుసైన్ అన్నారు.

 
అయితే, ఈ మహమ్మారి మొదలైనప్పుడు డాక్టర్లు తయారుగా లేరు. ఎలాంటి చికిత్స అందించాలో, ఏ మందులు వాడాలో స్పష్టంగా తెలీదు. అందుచేత చాలామందికి వ్యాధి ముదిరి, తీవ్ర అనారోగ్యం పాలై ప్రాణాలు వదిలారు. కానీ ఇప్పుడు చాలావరకూ ఎలాంటి చికిత్స అందించాలో తెలుసు. డాక్టర్లు అన్ని విధాలా రోగిని కాపాడటానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మరణాల సంఖ్య పెరగకపోవచ్చు కానీ వైరస్‌ నుంచీ కోలుకునేందుకు ఎక్కువ సమయం పడుతోంది. అందువల్ల కూడా ఆస్పత్రుల్లో బెడ్స్ త్వరగా ఖాళీ అవ్వడం లేదు.

 
ఫ్రంట్‌లైన్ వర్కర్లు అలిసిపోయారు. డాక్టర్లు రాత్రనక, పగలనక చికిత్స అందిస్తున్నారు. ఎన్నో రోజులుగా ఇంటికి వెళ్లనివారు కూడా ఉన్నారు. ఆస్పత్రుల్లో వైద్యం మాత్రమే కాకుండా ఫోన్ కాల్స్ చేసి సలహాలు అడుగుతున్నవారికి, భయాందోళనలతో సతమవుతున్నవారికి ధైర్యం చెప్తూ సలహాలు ఇస్తూ ఉన్నారు.

 
"నాకు రోజుకి 50 కన్నా ఎక్కువ ఫోన్ కాల్స్ వస్తాయి... ఏ ఆస్పత్రిలో బెడ్స్ దొరుకుతాయి, వ్యాధి లక్షణాలు కనిపిస్తే ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్లాలి అంటూ అడుగుతారు" అని డా. భాటీ చెప్పారు. కొంతమంది ఇంటి దగ్గరే ఉంటూ, వైద్యుల సలహాలు పాటిస్తూ కోవిడ్‌నుంచీ కోలుకుంటున్నారుగానీ కొంతమంది బాగా భయపడి ఆస్పత్రులకు పరిగెత్తుకొస్తున్నారు. "ఆక్సీమీటర్ ఎలా చూడాలో తెలియట్లేదని, కంగారుగా ఉందని, ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని... ఇలాంటి కారణాలతో ఎక్కువమంది హాస్పిటల్స్‌కు వస్తున్నారు" అని డా. భాటీ తెలిపారు.

 
"సెప్టెంబర్ చివర్లో కేసుల సంఖ్య తగ్గడంతో కోవిడ్ తగ్గిపోయిందని అందరూ భావించారు. కానీ, మహమ్మారి ఎక్కడికీ పోలేదు. ఆస్పత్రుల్లో ఉండనే ఉంది" అని క్రిటికల్ కేర్ విభాగంలో పనిచేస్తున్న ఒక వ్యక్తి తెలిపారు. మాస్క్ వేసుకోకుండా కనిపిస్తే రూ. 2,000 జరిమానా విధిస్తామని దిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. క్రిటికల్ కేర్ యూనిట్లల్లో అదనపు బెడ్స్ ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారని సమాచారం.

 
ప్రైవేటు ఆస్పత్రుల్లో 80% బెడ్స్ కోవిడ్ రోగులకు కేటాయించాలని తెలిపినట్లు సమాచారం. అయితే, దీనివల్ల అత్యవసర సర్జరీలు చెయ్యాల్సిన పేషెంట్లకు, ఇతర తీవ్ర వ్యాధులతో పోరాడుతున్న రోగులకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. మార్కెట్లు, పెద్ద పెద్ద సమూహాలు కూడే ప్రదేశాలను మూసివేయాలని, పెళ్లిళ్లు, వేడుకలకు హాజరయ్యే అతిధుల సంఖ్యను పరిమితం చెయ్యాలని ప్రభుత్వం దీర్ఘాలోచన చేస్తోంది. దేశంలోని మిగతా ప్రాంతాలనుంచీ డాక్టర్లను, పారామెడిక్స్‌ను దిల్లీకి రప్పిస్తున్నారు. "మేమింకా ఫస్ట్ వేవ్‌లోని శిఖరాగ్రాలలోనే ఉన్నాం. కొద్దికాలం తగ్గినట్లుగా అనిపించిందిగానీ కోవిడ్ మహమ్మారి నిజంగా తగ్గిపోలేదు. ఇప్పుడు శీతాకాలంలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది" అని డా. హుసేన్ తెలిపారు.