శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Updated : బుధవారం, 11 సెప్టెంబరు 2019 (19:29 IST)

పాక్ పాలిత కశ్మీర్‌లో ఆందోళనలు, నిరసనకారులను అరెస్టు చేసిన పాకిస్తాన్ పోలీసులు

పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లోని తిట్రినోట్ క్రాసింగ్ వద్ద కశ్మీర్ స్వయం ప్రతిపత్తి అనుకూల బృందం నియంత్రణ రేఖ వద్ద వరుసగా మూడో రోజు నిరసనలు కొనసాగించింది. ఈ నిరసనకు ముందు, శనివారం నాడు, పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) కార్యకర్తలు నియంత్రణ రేఖలోని తిట్రినోట్ క్రాసింగ్ పాయింట్ వైపు 'స్వాతంత్ర్య కవాతు' చేపట్టారు. భారత పాలిత కశ్మీర్‌లో ఆంక్షలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నామని నిరసనకారులు తెలిపారు.

 
కోట్లీ, సాధ్నోటి, భీంబర్, మీర్పూర్, రావల్‌కోట్, బాగ్ నుంచి తిట్రినోట్ వరకు ఈ కవాతు జరిగిందని జర్నలిస్ట్ ఎంఏ జైబ్ చెప్పారు. కానీ, తమను సర్సావా, కోట్లీ, డురాండి హజీరా ప్రాంతాల వద్దే పోలీసులు అడ్డుకున్నారని ప్రదర్శనకారులు తెలిపారు. పోలీసులు, నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో సుమారు 20 మంది గాయపడ్డారని, నాలుగు అంబులెన్సులు కూడా దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.

 
భద్రతాపరమైన కారణాల వల్ల నిరసనకారులను నియంత్రణ రేఖ వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని, ఇతర ప్రాంతాల్లో శాంతియుతంగా జరిగిన నిరసనలను తాము అడ్డుకోలేదని సంబంధిత అధికారి బీబీసీకి తెలిపారు. మొత్తం 38 మంది జేకేఎల్‌ఎఫ్ (ఎస్) మద్దతుదారులను అరెస్టు చేసినట్లు పోలీస్ అధికారి హజీరా తెలిపారు. మరోవైపు, భారత సైన్యం నియంత్రణ రేఖ వెంట రోజూ కాల్పులు జరుపుతోందని, ఇక్కడ ఎలాంటి నిరసనలూ జరగడం లేదని ఖోయ్ రత్తా పోలీస్ స్టేషన్‌లో పనిచేసే రైటర్ (గుమస్తా) చెప్పారు.

 
"మా ప్రాంతంలో సెప్టెంబర్ 6న నిరసన ప్రదర్శన జరిగింది. పోలీసులు, నిరసనకారులు మధ్య ఎలాంటి ఘర్షణ జరగలేదు" అని తాహిర్ అనే మరో ఉద్యోగి బీబీసీ ప్రతినిధి హుమైరా కన్వాల్‌కు చెప్పారు. "ముగ్గురు యువకులు నియంత్రణ రేఖను దాటేందుకు ప్రయత్నించినప్పుడు భారత సైన్యం కాల్పులు జరిపింది. ఆ ముగ్గురు యువకులు గాయపడ్డారు. అయితే, ఈ ప్రదర్శన ప్రారంభానికి ముందే ఈ యువకులు నియంత్రణ రేఖను దాటారు. ఆ యువకులు జెండాను ఎగురవేసేందుకు అక్కడకు వెళ్లారు" అని తాహిర్ తెలిపారు. అయితే, పోలీసులు లాఠీ ఛార్జ్ కూడా చేశారని, నిరసనకారులను అడ్డుకునేందుకు బాష్పవాయు గోళాలు కూడా ప్రయోగించారని, అనేక మంది గాయపడ్డారని జేకేఎల్ఎఫ్ నాయకులు ఆరోపించారు.

 
ఆందోళనకారులకు, పోలీసుల మధ్య ఘర్షణలు జరిగాయని ప్రత్యక్ష సాక్షి ఒకరు జర్నలిస్టు ఎంఏ జైబ్‌తో చెప్పారు. తమ కవాతు మొదట శాంతియుతంగానే సాగిందని ఈ కవాతుకు నాయకత్వం వహిస్తున్న సాఘీర్ (వృత్తిరీత్యా న్యాయవాది) అన్నారు. "స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం మేం చేస్తున్న ఈ కవాతులో పాకిస్తాన్ పాలిత కశ్మీర్ నుంచి వేలాది మంది పాల్గొన్నారు. మేం భారత దేశానికి అనుకూలం కాదు, పాకిస్తాన్‌కు అనుకూలం కాదు. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం మా అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు ఈ ప్రదర్శన చేస్తున్నాం" అని సాఘీర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

 
"మా ప్రదర్శన మొదటి దశ పూర్తయింది. రెండో దశలో, నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్, భారత సైన్యాల కాల్పులకు ప్రభావితమైన ప్రజలకు సంఘీభావం తెలుపుతాం" అని ఆయన చెప్పారు. తిట్రినోట్ వద్ద నిరవధిక నిరసన చేపడతామన్నారు. అరెస్టు చేసిన తమ నిరసనకారులను వెంటనే విడుదల చేయాలని పాకిస్తాన్ పాలిత కశ్మీర్ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

 
తిట్రినోట్ క్రాసింగ్‌కు ఎందుకంత ప్రాముఖ్యం?
భారత పాలిత కశ్మీర్ జిల్లా పూంచ్ ప్రాంతంలోని చారిత్రక పట్టణం రావల్‌కోట్ నుంచి గంటన్నర ప్రయాణం చేస్తే తిట్రినోట్ క్రాసింగ్ పాయింట్‌ వస్తుంది. దేశ విభజన సమయంలో విడిపోయిన కశ్మీరీ ముస్లిం కుటుంబాలను ఈ క్రాసింగ్ కలుపుతూ ఉంటుంది. భారత్, పాకిస్తాన్ ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం తరువాత, కశ్మీరీలు 2005 నుంచి ఈ క్రాసింగ్ పాయింట్లకు వస్తున్నారు. 2008లో ఇక్కడ వాణిజ్య మార్గం కూడా తెరిచారు.

 
కశ్మీర్‌ లోయలో ఉద్రిక్తతల నేపథ్యంలో మూసివేసిన ఈ ప్రాంతాన్ని ఇటీవల తెరిచారు. నియంత్రణ రేఖలో మొత్తం మూడు క్రాసింగ్ పాయింట్లు ఉన్నాయి. తిట్రినోట్, చకోటి, చల్లా టెర్మినల్స్. అందులో నియంత్రణ రేఖ వద్ద రాకపోకలు జరుగుతున్న ఏకైక ప్రదేశం తిట్రినోట్. ట్రావెల్ అండ్ ట్రేడ్ అథారిటీ అధికారుల ప్రకారం, తిట్రినోట్ క్రాసింగ్ పాయింట్ వాణిజ్యం కోసం వారానికి నాలుగు సార్లు తెరిచి ఉండేది, ఒకసారి ప్రయాణికుల కోసం తెరిచేవారు. ప్రస్తుతం ప్రయాణికులకు సోమవారం మాత్రమే తెరుస్తారు.