శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 27 నవంబరు 2020 (20:31 IST)

భారత్ బయోటెక్ సందర్శనకు హైదరాబాద్‌ వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ: ప్రెస్ రివ్యూ

హైదరాబాద్‌లో తయారవుతున్న టీకా పురోగతిని పరిశీలించడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 28న నగరానికి వస్తారని ఈనాడు వార్తా పత్రిక కథనం ప్రచురించింది. దాదాపు తొమ్మిది నెలలుగా ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారికి విరుగుడుగా టీకా తయారు చేసే ప్రయత్నాలు ఎలా సాగుతున్నాయో తెలుసుకోడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 28న హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ను సందర్శించనున్నారు.

 
దేశీయంగా ‘కరోనా’ టీకా తయారీ యత్నాల్లో భారత్‌ బయోటెక్‌ క్రియాశీలకంగా ఉన్న సంగతి విదితమే. ఈ సంస్థ ఆవిష్కరిస్తున్న కరోనా టీకా- కొవాగ్జిన్‌పై మొదటి, రెండు దశల క్లినికల్‌ పరీక్షలు పూర్తయి, ఇటీవల మూడో దశ పరీక్షలు మొదలయ్యాయి. ఇవి పూర్తయిన వెంటనే ప్రభుత్వం దీనికి ‘అత్యవసర వినియోగ అనుమతి’ ఇచ్చే అవకాశం లేకపోలేదు. దేశ ప్రజలందరికీ సాధ్యమైనంత తక్కువ ఖర్చులో టీకా అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని పత్రిక రాసింది.

 
ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి పర్యటన ఖరారైంది. శనివారం హైదరాబాద్‌ వచ్చే ప్రధాని, జీనోమ్‌ వ్యాలీలోని భారత్‌ బయోటెక్‌ యూనిట్‌ను సందర్శిస్తారని తెలిపింది. హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌తో పాటు, పుణెలోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాను కూడా ప్రధానమంత్రి శనివారం సందర్శించనున్నారు.

 
ఈనెల 28న భారత వాయుసేన విమానంలో ప్రధాని దిల్లీ నుంచి బయలు దేరి తొలుత పుణెలో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్తారు. మధ్యాహ్నం 2.40 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్‌లోని హకీంపేట ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో జీనోమ్‌ వ్యాలీలోని భారత్‌ బయోటెక్‌ యూనిట్‌కు వెళ్తారు. సాయంత్రం 4.10 గంటల నుంచి 5.10 వరకు అక్కడే ఉంటారు.

 
తిరిగి 5.35 గంటలకు హకీంపేటకు వెళ్లి అక్కడి నుంచి దిల్లీ తిరిగి వెళ్తారని ప్రధానమంత్రి కార్యాలయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచారం ఇచ్చినట్లు ఈనాడు వివరించింది.