ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (05:33 IST)

అధ్యాపక వృత్తిలో ఆ వెసులుబాటే వేరు: రఘురామ్ రాజన్

అధ్యాపక వృత్తిలో ఉన్న వెసులుబాటు ప్రపంచంలో మరే వృత్తిలోనూ దొరకదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అంటున్నారు. ఆర్‌బీఐ గవర్నర్‌ బాధ్యతల అనంతరం షికాగో యూనివర్సిటీలో అధ్యాపక విధుల్లో చేరిన రఘురామ్‌ రాజన్‌ తన ప్రస్తుత వృత్తిలో ఉన్న వెసులుబాటు గురించి మ

అధ్యాపక వృత్తిలో ఉన్న వెసులుబాటు ప్రపంచంలో మరే వృత్తిలోనూ దొరకదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అంటున్నారు. ఆర్‌బీఐ గవర్నర్‌ బాధ్యతల అనంతరం షికాగో యూనివర్సిటీలో అధ్యాపక విధుల్లో చేరిన రఘురామ్‌ రాజన్‌ తన ప్రస్తుత వృత్తిలో ఉన్న వెసులుబాటు గురించి మీడియాతో పంచుకున్నారు. ‘‘వాస్తవిక ప్రపంచంలో ఉద్యోగ విధుల్లో ఉన్న వారికి కనీసం ఆలోచించేంత తీరిక కూడా దొరకదు. అదే ఇబ్బంది. ఇపుడు అధ్యాపక రంగంలో ఉన్నాను. కావాలంటే నాలుగు రోజులు ఓ గదిలో గడిపేయగలను. కూర్చుని పేపర్‌ వంక చూస్తూ బయటకు రానంటున్న ఆలోచనలతో పోరాడొచ్చు’’ అంటూ ప్రస్తుత వృత్తిలో ఉన్న వెసులుబాటును రాజన్‌ చెప్పుకొచ్చారు. పరిశోధనల గురించి చెబుతూ... దాన్నెప్పుడూ వదిలిపెట్టేది లేదని, ఆర్‌బీఐలో ఉన్నప్పుడు కూడా తాను కొన్ని పేపర్లను ప్రచురించానని తెలియజేశారు. 
 
తాను వెనక్కి తిరిగి రావడం, షికాగోలో బైక్‌ రైడింగ్‌ చేయడం గొప్పగా ఉందన్నారు. ‘‘బైక్‌ను బయటకు తీసి తీరం వెంట రహదారిపై దాన్ని నడపడం నా జీవితంలో గొప్ప అనుభూతి. కోరుకున్నంత కాలం నేను ఈ పనిచేయగలనని భావిస్తున్నాను’’ అన్నారాయన. ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్‌ షికాగో బూత్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ మీడియా బృందానికి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. బూత్‌ స్కూల్‌ పాతికేళ్ల పాటు తనకు ఇల్లులా ఉందన్నారు. దాన్ని ఓ అద్భుతమైన స్కూల్‌గా అభివర్ణించారు. ‘‘ఇదో గొప్ప నగరం. గొప్ప సహచరులున్నారు. ఇక్కడికొచ్చిన ప్రతిసారీ ఇది విభిన్నంగా కనిపిస్తుంది’’ అని పేర్కొన్నారు.
 
ప్రస్తుతం రఘురామ్‌ రాజన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ షికాగో బూత్‌ స్కూల్లో ఫైనాన్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 1991లోనే ఆయన బూత్‌ స్కూల్లో ప్రొఫెసర్‌గా చేరగా... మధ్యలో 2003 నుంచి 2006 వరకు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థలో చీఫ్‌ ఎకనమిస్ట్, రీసెర్చ్‌ డైరెక్టర్‌గా, 2013 నుంచి 2016 వరకు మూడేళ్ల పాటు ఆర్‌బీఐ గవర్నర్‌గా సేవలందించిన విషయం తెలిసిందే.