ఇకపై డీటీహెచ్ సర్వీస్ ప్రొవైడర్లు కూడా మార్చుకోవచ్చు.. ఎలా?
ప్రస్తుతం టెలికాం రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా, 4జీ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత టెలికాం సేవలు సామాన్యుడికి సైతం మరింత దగ్గరయ్యాయి. అలాగే, వాడుతున్న మొబైల్ నంబరును మార్చుకోకుండానే మరో సర్వీస్ ప్రొవైడర్‌కు మారే వెసులుబాటు ఉంది. అలాగే, ఇపుడు డీటీహెచ్, కేబుల్ టీవీ నెట్‌వర్క్‌లు కూడా తమకు అనుగుణంగా మార్చుకునే వెసులుబాటు రానుంది. ఈ మేరకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) చర్యలు చేపట్టింది.
ఇకపై కేబుల్ టీవీ, డీటీహెచ్ సర్వీస్ ప్రొవైడర్లు తమ వినియోగదారులకు అందజేసే సెట్‌టాప్ బాక్సులు తప్పనిసరిగా ఇంటరాపరబిలిటీ సపోర్ట్‌ను కలిగి ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. సెట్‌టాప్ బాక్సుల్లో ఇంటరాపరబిలిటీ సపోర్ట్‌ను తప్పనిసరి చేసేందుకు అవసరమైన నిబంధనలను ప్రవేశపెట్టాలని ట్రాయ్ శనివారం సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు విజ్ఞప్తి చేసింది.
వినియోగదారులు కొత్త సెట్‌టాప్ బాక్సును కొనుగోలు చేయకుండానే తమ సర్వీస్ ప్రొవైడర్‌ను మార్చుకొనేందుకు ఇంటరాపరబుల్ సెట్‌టాప్ బాక్సులు వీలుకల్పిస్తాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని డీటీహెచ్, కేబుల్ టీవీ నెట్‌వర్కులు తమ వినియోగదారులకు నాన్-ఇంటరాపరబుల్ సెట్‌టాప్ బాక్సులను అందజేస్తున్నాయి.
ఒక నెట్‌వర్క్ నుంచి మరో నెట్‌వర్క్‌కు మారేందుకు నాన్-ఇంటరాపరబుల్ సెట్‌టాప్ బాక్సులు ఉపయోగపడవు. దీంతో వినియోగదారులు సర్వీస్ ప్రొవైడర్‌ను మార్చుకోవాలంటే కొత్త సెట్‌టాప్ బాక్సును కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఫలితంగా వినియోగదారుడిపై అదనపుభారం పడుతోంది. దీన్ని తగ్గించేందుకు ట్రాయ్ చర్యలు చేపట్టింది.