పాకిస్థాన్ క్రికెట్లో ప్రకంపనలు : సెలక్షన్ కమిటీ సభ్యుడు అలీమ్ దార్ రాజీనామా
పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో ప్రకంపనలు మొదలయ్యాయి. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2026లో జట్టు దారుణంగా విఫలమైంది. ఈ నేపథ్యంలో పాక్ జాతీయ సెలక్షన్ కమిటీ సభ్యుడు, లెండరీ అంపైర్ అలీమ్ దార్ తన పదవికి రాజీనామా చేశారు.
పాకిస్థాన్ క్రికెట్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ 2026లో జట్టు దారుణంగా విఫలమైన నేపథ్యంలో పాక్ జాతీయ సెలక్షన్ కమిటీ సభ్యుడు, లెజెండరీ అంపైర్ అలీమ్ దార్ తన పదవికి రాజీనామా చేశారు. సెలక్షన్ కమిటీలో తనకు స్వయంప్రతిపత్తి లేకపోవడం, అంతర్గత విభేదాలతో విసిగిపోయి ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాకిస్థానీ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ సూపర్-8 దశను దాటలేకపోయింది. చిరకాల ప్రత్యర్థి భారత్తో పాటు ఇంగ్లండ్ చేతిలోనూ ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ వైఫల్యానికి ఆటగాళ్లపై పీసీబీ ఇప్పటికే ఆర్థిక జరిమానాలు విధించినప్పటికీ, సమస్యలు అంతకంటే లోతుగా ఉన్నాయని అలీమ్ దార్ రాజీనామాతో స్పష్టమైంది.
ప్రపంచ కప్ జట్టు ఎంపిక సమయంలోనే అలీమ్ దార్ తీవ్ర అసంతృప్తికి గురైనట్టు తెలుస్తోంది. ఫామ్ లో లేని సీనియర్ ఆటగాళ్లు బాబర్ ఆజం, షాదాబ్ ఖాన్లను జట్టులోకి తీసుకోవడాన్ని ఆయన గట్టిగా వ్యతిరేకించారు. ప్రదర్శన ఆధారంగానే ఎంపికలు జరగాలని, నిలకడలేని ఆటగాళ్ల స్థానంలో వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్కు ఆరో స్థానంలో కచ్చితమైన పాత్ర ఇవ్వాలని సూచించారు. అయితే, ఆయన సూచనలను పక్కనపెట్టారు.
జట్టు ఎంపికలో హెడ్ కోచ్ మైక్ హెస్సన్ జోక్యం శ్రుతిమించిందని, మరో సెలక్టర్ ఆకిబ్ జావేద్ కూడా కోచ్ కే మద్దతు పలకడంతో తాను ఒంటరివాడినయ్యానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కెప్టెన్ సల్మాన్ అలీ అఘా గానీ, ఇతర సభ్యులు గానీ కోచ్ జోక్యాన్ని ప్రశ్నించకపోవడం తనను ఆశ్చర్యపరిచిందని ఆయన సన్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం. కమిటీలో తన సూచనలకు విలువ లేదని భావించిన 57 ఏళ్ల అలీమ్ దార్, తన ఉనికి అనవసరమని భావించి పదవి నుంచి తప్పుకున్నారు.