పిల్లలు చూస్తుండగానే భార్య గొంతు కోసి హత్య
హైదరాబాద్ నగరంలో ఓ దారుణం జరిగింది. కన్నబిడ్డలు చూస్తుండగానే ఓ కిరాతక భర్త తన భార్యను గొంతుకోసి హత్య చేశాడు. ఈ దారుణం రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జల్‌పల్లిలోని న్యూబాబానగర్ ఉండే ముస్తఫా (35), అజ్మీరా (30) అనే దంపతులకు ముగ్గురు సంతానం. తాను పనికి వెళ్లాక మరో వ్యక్తితో భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని ముస్తఫా అనుమానించసాగాడు. ఇదే విషయంపై పలుమార్లు కన్నబిడ్డల ముందే ఘర్షణపడ్డాడు.
ఈ క్రమంలో సోమవారం రాత్రి ఇంటికి వచ్చి మరోమారు భార్యతో గొడవపెట్టుకున్నాడు. ముస్తఫాకు ఆమె ఎదురు సమాధానం చెప్పడంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన ముస్తఫా పిల్లలు చూస్తుండగానే కత్తితో గొంతుకోసి దారుణంగా హతమార్చాడు. నిందితుడు తన మొబైల్ ఫోనును ఇంట్లోనే పడేసి పారిపోయాడు. సమాచారం అందుకున్న బాలాపూర్ పోలీసులు... చుట్టుపక్కల పోలీస్ స్టేషన్‌లకు సమాచారం అందించారు. బాలాపూర్ పోలీసులు పంపించిన ఫోటో ఆధారంగా నిందితుడుని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

