బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By chj
Last Modified: బుధవారం, 11 జనవరి 2017 (20:28 IST)

యువతకు స్ఫూర్తి ప్రదాత వివేకానంద... జనవరి 12 వివేకానందుని జయంతి

“ఇనుప నరాలు, ఉక్కు కండరాలున్న వంద మంది యువకులను ఇస్తే ఈ దేశాన్ని మార్చి చూపిస్తాను” అన్న ద్రష్ట స్వామి వివేకానంద. ఈ దేశ భవిష్యత్తు తీర్చిదిద్దే శక్తి యువతరం చేతుల్లోనే ఉందని నూరేళ్ల క్రితమే గుర్తించి, బాహాటంగా ఆనాడే చాటిన దార్శనికత ఆయనది. సృజనాత్మక మ

“ఇనుప నరాలు, ఉక్కు కండరాలున్న వంద మంది యువకులను ఇస్తే ఈ దేశాన్ని మార్చి చూపిస్తాను” అన్న ద్రష్ట స్వామి వివేకానంద. ఈ దేశ భవిష్యత్తు తీర్చిదిద్దే శక్తి యువతరం చేతుల్లోనే ఉందని నూరేళ్ల క్రితమే గుర్తించి, బాహాటంగా ఆనాడే చాటిన దార్శనికత ఆయనది. సృజనాత్మక మనోవీక్షణ ప్రక్రియకు ప్రాణం పోసి, దానిని విశ్వవ్యాప్త ప్రాచుర్యం కల్పించిన స్ఫూర్తి ప్రదాతలను పేర్కొనవలసి వస్తే ముందుగా చెప్పాల్సిన పేరు నిస్సందేహంగా స్వామి వివేకానందుడిదే. ఆధునిక భారతదేశం ప్రపంచంలోనే ఒక మహత్తర శక్తిగా ఎదగడానికి ఆయన జీవించి ఉన్న కొద్దికాలంలోనే పటిష్టమైన పునాదులు వేశారు. 
 
ప్రజ్ఞలో, మేధా సంపత్తిలో భారతీయులు మరెవరికి తక్కువ కాదని నిరూపించడం ద్వారా, ముఖ్యంగా భారతీయ యువతరంలో చైతన్యం నింపడానికి, ఆత్మ విశ్వాసం కలిగించడానికి ఆయన తన జీవితమంతా కృషి చేశారు. ఆలోచన పటిమ, నిర్ణయ సామర్ధ్యం, వెనుదిరగని ఆచరణ, ధైర్యంతో ఫలితాలను స్వీకరించగలిగే ధీరత్వాన్ని యువకుల హృదయాల్లో ప్రతిష్ఠించడానికి వివేకానంద ఎంతగానో ప్రయత్నించారు. భావి భారతీయ తరాలకు ఎన్నటికీ తరగని కార్యదక్షత, స్ఫూర్తిని అందజేయడం కోసం ఆయన అలుపెరగని పరిశ్రమ చేశారు.
 
ఏ దేశంలోనైనా మంచి మార్పు రావడానికి ఏళ్ల తరబడి శ్రమించాల్సిన అవసరంలేదని, యువజనులంతా మనస్ఫూర్తిగా కలిసికట్టుగా పరిశ్రమిస్తే కొద్ది రోజుల్లోనే మార్పు సాధ్యమౌతుందని వివేకానందుని భావన. ప్రపంచ దేశాలను తిరిగిన ఆయన అభివృద్ధి చెందిన దేశాలలోని యువతరానికి భారతీయ యువతరానికి ఆలోచన విధానంలోను, మనస్తత్వంలోను ఉన్న భేదాలను ప్రస్ఫుటంగా గమనించారు. భారతదేశం ఎదుర్కొంటున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్యల కంటే అతి పెద్ద సమస్య ఇక్కడి యువతరానికి సరియైన ఆలోచనా దృక్పథం లేకపోవడమేనని వివేకానంద భావించారు. ఆయన తన ప్రసంగాలతో, పుస్తకాలతో, సూక్తులతో యువతరాన్ని ఉత్తేజపరిచి, దిశానిర్ధేశం చేశారు.
 
 ఓటమిని జీర్ణించుకోలేక చిన్న చిన్న పరాజయాలకే నిరాశకు గురై కృంగిపోయే భారతీయ యువతరాన్ని వివేకానంద తన బోధనలతో చైతన్యపర్చారు. పరాజయాల నుండి గుణపాఠాలు నేర్చుకోవాలని, ఓటమి అనేది అపకారి కాదని, అవి జీవితానికి మెరుగులు దిద్దుతుందని ఆయన భావన.  ఓడిపోతామనే భయంతో ప్రయత్నించకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడమే మేలని, నిరంతంరం శ్రమించే వాడిని చూసి ఓటమి కూడా భయపడుతుందని యువతకు ఆయన ప్రబోధించారు. ధీరులు అపజయాలను చూసి కుంగిపోరని, విజయం సాధించేవరకు పోరాటం చేస్తారనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
 
ఓడిపోతామనే భయంతో ప్రయత్నించకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలని అనేవారు. ఓటమి కంటే విజయం బాధ్యతను పెంచుతుని, విజేతలు ఏవిధంగా ఉండాలో కూడా వివేకానంద తెల్పారు. విజయం సాధించామని విర్రవీగరాదని, విజయం నుండి వినయాన్ని నేర్చుకోవాలని సందేశాన్నిచ్చారు. అట్లే లక్ష్యసాధనలో పరాజితులు విజయాన్ని ఎలా కైవసం చేసుకోవాలో కూడా ఆయన యువతరానికి తెల్పారు. లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధాసక్తుల్ని లక్ష్య సాధనలో సైతం చూపించాలని, విజయానికి అసలు రహస్యం ఇదేనని అన్నారు. ప్రేమ, నిజాయితీ, పవిత్రత కలిగిన వారిని ప్రపంచంలో ఏ శక్తి ఓడించలేదనేది ఆయన భావన. 
 
ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం అనేవి విజయాన్ని కాంక్షించే వారికుండే ప్రాథమిక లక్షణాలని అనేవారు. ఒక్కరోజులో దేనిని సాధించలేమని, పట్టుదల వదలకుండా చేసే ప్రయత్నం విజయాన్ని చేకూర్చుందనే సత్యాన్ని యువత గుండెల్లో నాటుకునేలా నొక్కి చెప్పారు. నిరాశ, నిస్పృహలు కమ్ముకున్న ప్రతి క్షణాన "లేవండి! మేల్కొనండి! గమ్యం చేరే వరకు విశ్రమించకండి" అని వివేకానండుడు చెప్పిన సూక్తే యువతరాన్ని చైతన్యపథం వైపుకు అడుగులు వేయిస్తుంది.
భారతీయ యువతరంలో ఆయన గమనించిన ప్రధాన లోపం భయం. మనిషి పతానికైనా - పాపానికైనా భయమే ప్రధానకారణమని, భయంలోనే చావు ఉందనే అభిప్రాయాన్ని వివేకానందుడు వ్యక్తం చేశారు. 
 
“బలమే జీవనం. బలహీనమే మరణం” అని ఆయన ఇచ్చిన సందేశం మానవజాతికే అతి గొప్ప సందేశం. మనిషి శరీరాన్ని ధరించినప్పుడు సాక్షాత్తు భగవంతుడైనా సరే బాధలను అనుభవించి తీరాల్సిందేనని, అందుకే దృష్టిని బాధలపై ఉంచకుండా పరిష్కారం పై ఉంచండని ఉద్భోదించారు. అత్యున్నతమైన ఆదర్శాన్ని కలిగి యువతరం ధైర్యంగా ముందుకు సాగాలనీ, ఈర్ష్యాను – స్వార్ధాన్ని వదిలిపెడితే ప్రపంచాన్నే కదిలించవచ్చునని ఆయన బలంగా నమ్మేవారు. బలాఢ్యులై, ధైర్యశాలులై భారతీయ యువతరం నిలబడాలని, బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని ఆయన కోరుకునేవారు.  చేసేది చిన్న పనైనా శ్రద్ధతో సవ్యంగా చేస్తే మహాద్భుత ఫలితాన్నిస్తుందని, కావున ప్రతి వ్యక్తి తాను చేయగల పని చిన్నదైనా శ్రద్ధతో నిర్వహించాలని ప్రబోధించారు. సమాజాన్ని సంస్కరించాలనుకునే వారు ముందుగా తమను తాము సంస్కరించుకోవాలని ఆయన తెల్పారు. యువత సచ్ఛీలత కలిగిఉండాలని ఆయన ప్రతిసారి చెబుతూ ఉండేవారు.
 
భారతీయ యువతరం యెుక్క శక్తి సామర్ధ్యాలపై వివేకానందునికి అంచంచలమైన విశ్వాసం ఉంది. భావి భారత భవిష్యత్తు యువతరం చేతిలోనే ఉందని, దేశ తలరాతలు మార్చగలిగే సత్తా వారికే మాత్రమే ఉందని ఆయన ప్రగాఢంగా నమ్మారు. అలాంటి యువతరాన్ని తన ప్రసంగాల ద్వారా చైతన్యపర్చడానికి ప్రయత్నించారు.  వివేకానందుని బోధనలు, సూక్తులు కేవలం భారతీయ యువతరానికి మాత్రమే పరిమితం కాదు. ప్రపంచంలో నిరాశ, నిస్పృహలతో సతమతమవుతున్న యువతరానికి ఆయన సూక్తులు  చైతన్య ప్రబోధాలు. "ఈ ప్రపంచంలో వున్న సకల శక్తి నీలో వుంది. అసమర్ధుడునని భావించకు. నీవు ఏమైనా చేయగలవు. అన్నింటిని సాధించగలవు" అని యువతరానికి వివేకానందుడు ఆధునిక భగవద్గీతను బోధించారు. వివేకానందుడు నేడు భౌతికంగా లేకపోయినా ఆయన ప్రబోధాలు, సూక్తులు సజీవంగా యువతరానికి ప్రేరణ కలుగజేస్తూనే ఉంటాయి. యువశక్తికి నిత్యం కొత్త ప్రేరణ అందించే మహనీయునిగా ప్రపంచ నీరాజనాలు అందుకున్న వివేకానందుడు జన్మించిన గడ్డపై జన్మించడం ప్రతి భారతీయుడు చేసుకున్న అదృష్టం.