1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : గురువారం, 10 నవంబరు 2016 (09:09 IST)

నోట్ల రద్దుపై ఆర్నెల్లుగా కసరత్తు... ఆ ముగ్గురే కీలకం... చివరి నిమిషం వరకు అత్యంత గోప్యంగా...

దేశంలో ప్రస్తుతం చెలామణిలో ఉన్న పెద్ద విలువ కలిగిన రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం రాత్రి ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే ఈ నోట్లన్నీ ఎంద

దేశంలో ప్రస్తుతం చెలామణిలో ఉన్న పెద్ద విలువ కలిగిన రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం రాత్రి ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే ఈ నోట్లన్నీ ఎందుకు పనికిరాని చిత్తుకాగితాల్లా మారిపోయాయి. అయితే, ఈ నోట్టను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది మాత్రం ఆర్నెల్ల క్రితమే తీసుకున్నారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. అయితే, ఈ విషయం మాత్రం కేవలం ముగ్గురంటే ముగ్గురికి మాత్రమే తెలుసు. వారెవరంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్, ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రాలు. చివరకు దేశ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి గానీ, ఆర్థిక శాఖ కార్యదర్శికికానీ ఈ విషయం తెలియకపోవడం గమనార్హం. 
 
నానాటికీ పెరిగిపోతున్న నల్లధనాన్ని కట్టిడి చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఇందులోభాగంగా, అప్పటి రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్‌తో ప్రత్యేకంగా సమావేశమై నల్లధనం నియంత్రణపై చర్చించారు. ఈ భేటీలో పెద్ద నోట్లు రద్దు చేయాలని నిర్ణయించారు. అదేసమయంలో రూ.50, రూ.100 నోట్లు ఎక్కువగా ముద్రించాలని సూచించారు. ఆ తర్వాత ఆర్బీఐ గవర్నర్‌గా నియమితులైన ఉర్జిత్ పటేల్‌కు ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించింది. 
 
అయితే, కొత్త నోట్ల ముద్రణతోపాటు... పాత నోట్ల రద్దుకు ఆర్థిక శాఖ అధికారుల సహకారం కావాల్సి వచ్చింది. దీంతో ప్రధాని మోడీ.. తన మంత్రివర్గ సహచరుడు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి వివరించి, నమ్మకస్తులైన అధికారులు కావాలని కోరారు. ప్రధాని చెప్పిందే తడవుగా... అత్యంత విశ్వసనీయులైన ఇద్దరు సీనియర్ అధికారులకు ఈ బాధ్యతలు అప్పగించారు. అంటే.. ప్రధాని, రాజన్, నృపేంద్ర మిశ్రా, ఉర్జిత్ పటేల్, అరుణ్ జైట్లీతో పాటు.. మరో ఇద్దరు సీనియర్ అధికారులకు మాత్రమే ఈ విషయం తెలుసు. 
 
ఆ తర్వాత నోట్ల రద్దు, కొత్త నోట్ల డిజైన్, ముద్రణపై అధికారుల బృందం, అరుణ్ జైట్లీ ప్రధాని మోడీతో పలుమార్లు సమావేశమయ్యారు. ఇందులో తుది నిర్ణయం తీసుకున్న తర్వాత రూ.2000, రూ.500 నోట్ల ముద్రణకు అనుమతిచ్చారు. ఈ నేపథ్యంలో గత గురువారం అన్ని రాష్ట్రాల ఆర్బీఐ డైరెక్టర్లతో జైట్లీ సమావేశమయ్యారు. పెద్ద నోట్ల రద్దుపై అభిప్రాయం కోరారు. కొందరు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. దీంతో సమావేశ విషయాన్ని రహస్యంగా ఉంచాలని వారికి సూచన చేశారు. 
 
ఆ తర్వాత శుక్రవారం సాయంత్రం మోడీ, జైట్లీలు రహస్యంగా సమావేశమయ్యారు. ఆ తర్వాత రద్దు నిర్ణయం ప్రభావాన్ని చర్చించేందుకు ఆర్థికశాఖ అధికారులతోనూ సమావేశమయ్యారు. రూ.100 నోట్లను ఏటీఎంలకు పంపించవద్దని, పెద్ద నోట్లను మాత్రమే పంపించాలని ఆర్బీఐకి ఆర్థికశాఖ నోట్ జారీ చేసింది. 
 
అదేసమయంలో బుధవారం నుంచి రూ.1000, రూ.500 నోట్లు తీసుకోవద్దంటూ మంగళవారం ఉదయమే ఆర్బీఐకి ఆదేశాలు అందాయి. ఇక చివరిగా మంగళవారం సాయంత్రం ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ఫ్యాక్స్ వచ్చింది. అర్థరాత్రి నుంచి పెద్ద నోట్లు చెల్లవని అన్ని బ్యాంకులకు ఆర్బీఐ గవర్నర్ సమాచారం ఇచ్చారు. 
 
మొత్తం ప్రణాళిక పూర్తయ్యాక చివరిగా మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు రిజర్వ్ బ్యాంకు బోర్డు భేటీ అయింది. రూ.1000, రూ.500 నోట్లు రద్దు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. సాయంత్రం ఆరున్నర గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం అయింది. అక్కడే సహచర మంత్రులకు జైట్లీ రద్దు విషయాన్ని చెప్పారు. సాయంత్రం 8 గంటలకు మోడీ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఇలా... నోట్ల రద్దు వెనుక భారీ కసరత్తు జరిగింది.