శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : గురువారం, 10 ఆగస్టు 2017 (11:52 IST)

నంద్యాల బైపోల్ : టీడీపీకి ఓటమి భయం... బరిలోకి ఇద్దరు స్టార్ హీరోలు...

నంద్యాల ఉప ఎన్నికల పోరు అధికార తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, టీడీపీ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో ఈ ఎన్నికలను టీడీపీ శ్రేణులన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

నంద్యాల ఉప ఎన్నికల పోరు అధికార తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, టీడీపీ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో ఈ ఎన్నికలను టీడీపీ శ్రేణులన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న దివంగత భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి కుమారుడు భూమా బ్రహ్మానంద రెడ్డిని గెలిపించుకునేందుకు టీడీపీ మంత్రులు, సీనియర్ నేతలు నియోజకవర్గంలోనే తిష్టవేసివున్నారు. అయినప్పటికీ టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది. దీనికి కారణం రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉండటంతో పాటు.. స్థానిక పరిస్థితులు ఆ పార్టీకి ముచ్చెమటలు పోయిస్తున్నాయి. 
 
దీంతో ఈ ఉప ఎన్నికల పోరుకు సినీ గ్లామర్‌ను కూడా జోడించాలని టీడీపీ నిర్ణయించింది. రాయలసీమ ప్రాంతంలో అమితమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న నందమూరి బాలకృష్ణను కనీసం మూడు నుంచి నాలుగు రోజుల పాటు ప్రచారం నిమిత్తం తీసుకురావాలని తెలుగుదేశం భావిస్తోంది. ఇందుకు బాలయ్య కూడా సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది.
 
అలాగే, 2014లో తమకు అనుకూలంగా ప్రచారం చేసిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను కూడా నంద్యాలలో తమ తరపున పోటీ చేసే అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేసేలా చూడాలని భావిస్తోంది. ఇక ఆయన ప్రచారానికి రాలేనని చెబితే, కనీసం మీడియా ముఖంగానైనా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించేలా పవన్‌ కళ్యాణ్‌తో చెప్పించాలని భావిస్తోంది. 
 
మరోవైపు.. నంద్యాల ఉప ఎన్నికల ఘట్టం కీలక దశకు చేరుకోగా నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసిపోగా, మొత్తం 15 మంది రంగంలో ఉన్నట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. బుధవారం 9 మంది తమ నామినేషన్లను ఉపసంహరించనుకున్నారు. పోటీ పడే అభ్యర్థులు 16 మంది కన్నా ఎక్కువగా ఉంటే రెండో ఈవీఎం యంత్రాన్ని వాడాల్సి వుంటుంది. దీంతో ఎంతమంది తమ నామినేషన్లను వెనక్కు తీసుకుంటారో తెలియని స్థితిలో అటు అధికారుల్లో, ఇటు పార్టీల్లో కాసేపు ఆందోళన వ్యక్తమైంది. చివరకు 15 మందే బరిలో మిగలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
 
ఇక తెలుగుదేశం పార్టీ తరపున భూమా బ్రహ్మానందరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున శిల్పా చంద్ర మోహన్‌ రెడ్డి ప్రధానంగా పోటీ పడుతుండగా, కాంగ్రెస్‌ తరపున గడ్డం అబ్దుల్‌ ఖాదర్‌, బీసీ యునైటెడ్‌ ఫ్రంట్‌ తరపున గాజుల అబ్దుల్‌ సత్తార్‌, రాయలసీమ పరిరక్షణ సమితి తరపున భవనాశి పుల్లయ్య, సమాజ్‌ వాది పార్టీ నుంచి రాఘవేంద్ర, నవతరం పార్టీ నుంచి రావు సుబ్రహ్మణ్యం, రాజ్యాధికార పార్టీ నుంచి వల్లిగట్ల రెడ్డప్ప, అన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున షేక్‌ మహబూబ్‌ బాషాలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పి.గురువయ్య, నాగనవీన్‌ ముద్దం, బాల సుబ్బయ్య. ఎ.భూపనపాటి నరసింహులు, ఎస్‌ రఘునాథరెడ్డి, సంగ లక్ష్మీకాంతరెడ్డి పోటీ పడుతున్నారు. ఈ నెల 23న ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే.