ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: శుక్రవారం, 2 జూన్ 2017 (14:58 IST)

పళనిస్వామీ... ఊపిరి బిగబట్టుకో... జైలుకెళ్లిన దినకరన్ తిరిగొచ్చేశాడు...

మాహిష్మతీ... ఊపిరి పీల్చుకో... బాహుబలి తిరిగొచ్చాడు అనే దేవసేన డైలాగ్ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ డైలాగ్ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి రివర్స్ అవుతోంది. పళనిస్వామీ... ఊపిరి బిగబట్టుకో... జైలుకెళ్లిన దినకరన్ తిరిగి వచ్చేశాడు... అంటూ కొందరు సెటైర్

మాహిష్మతీ... ఊపిరి పీల్చుకో... బాహుబలి తిరిగొచ్చాడు అనే దేవసేన డైలాగ్ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ డైలాగ్ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి రివర్స్ అవుతోంది. పళనిస్వామీ... ఊపిరి బిగబట్టుకో... జైలుకెళ్లిన దినకరన్ తిరిగి వచ్చేశాడు... అంటూ కొందరు సెటైర్లు విసురుతున్నారు.
 
అన్నాడిఎంకే పార్టీలో చీలికల తరువాత ఆపసోపాలు పడి పళణిస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆ పదవిని కాపాడుకునేందుకు ఆయన పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. పన్నీరుసెల్వం వర్గం నుంచి ఒకవైపు, సొంత నేతల నుంచి మరొకరకమైన ఒత్తిడి.. ఇలా చెప్పుకుంటూ పోతే పళణిస్వామి బాధలు చెప్పుకునేందుకే చాలనన్ని. శశికళ మేనల్లుడు దినకరన్ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నట్లు చెప్పిన తరువాత... ఇంకా అంతా అయిపోయిందిలే.. జైలుకు వెళ్ళిన దినకరన్ తిరిగి రాడులే అనుకుని ఊపిరిపీల్చుకున్నారు పళణిస్వామి. అలా నడుస్తుండగా తాజాగా దినకరన్ కు ఢిల్లీలో బెయిల్ వచ్చింది. బెయిల్ తరువాత దినకరన్ బయటకు వచ్చేశాడు. ఇంకేముంది పళణిస్వామికి మళ్ళీ భయం పట్టుకుంది. దినకరన్ మళ్ళీ పార్టీలోకి వచ్చి తన సీటుకు ఎసరు పెడతాడేమోనని. అయితే పార్టీలోకి వెళ్ళాలన్న ఆలోచన దినకరన్ కూడా ఉందట.
 
ఏకంగా ఎన్నికల కమిషన్‌కే డబ్బులు ముట్టజెప్పడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయిన శశికళ మేనల్లుడు దినకరన్‌కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. 5 లక్షల రూపాయల సొంత పూచీ కత్తుతో పాటు పాస్‌పోర్టును కోర్టుకు అప్పజెప్పాలంటూ షరతులతో కూడిన బెయిల్‌ను ఢిల్లీ కోర్టు ఇచ్చింది. దీంతో దినకరన్ బయటకు వచ్చేశాడు. దినకరన్ బయటకు వస్తే వచ్చే నష్టమేమీ లేదు కదా అని కొంతమంది అనుకుంటారు గానీ ఆ నష్టం మొత్తం పళణిస్వామిపైనే ఎక్కువగా ఉందట. 
 
కారణం శశికళ ఆదేశాలతోనే పళణిస్వామి సిఎం అవ్వడం.. మేనల్లుడుని సిఎం చెయ్యాలన్న ఆలోచనతో ఆర్కే నగర్ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం.. ఆ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని రాంగ్ రూట్లో వెళ్ళి దినకరన్ దొరికిపోవడం అన్నీ జరిగిపోయాయి. దినకరన్ జైలుకు వెళ్ళే సమయంలో తాను తిరిగి పార్టీ వ్యవహారాలను పట్టించుకోనంటూ తేల్చి చెప్పి వెళ్ళిపోయాడు. అయితే ఆ తరువాత అదృష్టం కొద్దీ దినకరన్‌కు బెయిల్ కాస్త మంజూరైంది. దినకరన్ ముందున్నది అన్నాడిఎంకే పార్టీలో కీలక నేతగా ఉండడమే. 
 
అందుకే తిరిగి అన్నాడిఎంకేలోకి ప్రవేశిస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జరిగితే పళణిస్వామి, ఆ తరువాత పన్నీరుసెల్వం ఇద్దరికీ ఇబ్బందులు తప్పవనేది తమిళ రాజకీయ విశ్లేషకులు భావన. ఇప్పుడిప్పుడే జైలు నుంచి బయటకు వచ్చిన దినకరన్ ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగుతాడా.. లేక కొన్ని రోజులు సైలెంట్‌గా ఉండి ఆ తరువాత విజృంభిస్తాడా అని జనం కాదు కానీ తమిళనాడు సీఎం పళనిస్వామి మాత్రం ఊపిరి బిగబట్టుకుని చూస్తున్నారట.