శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: శనివారం, 12 ఆగస్టు 2017 (17:27 IST)

తమిళనాడు పాలి'ట్రిక్స్'... నువ్వొక్కసారి చెప్పత్తా... అత్తారింటికి దారేది... ఎవరు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ నటించిన ఈ సినిమాలోని కథ మళ్ళీ రిపీట్ అయ్యేటట్లు కనిపిస్తోంది. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్‌ తన అత్తను ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే.. తమిళనాడు రాజకీయాల్లో దినకరన్ తన మేనత్తను సలహా అడిగేందుకు వెళుతున్నాడు. అది కూడా అత్తను వెతు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ నటించిన ఈ సినిమాలోని కథ మళ్ళీ రిపీట్ అయ్యేటట్లు కనిపిస్తోంది. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్‌ తన అత్తను ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే.. తమిళనాడు రాజకీయాల్లో దినకరన్ తన మేనత్తను సలహా అడిగేందుకు వెళుతున్నాడు. అది కూడా అత్తను వెతుక్కుంటూ మరీ వెళుతుండటంతో అత్తారింటికి దారేది అన్న పరిస్థితి కనిపిస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో పార్టీలో తాను కీలక వ్యక్తిగా ఉండాలన్న ఉద్దేశంతో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు దినకరన్. అందుకే అత్త శశికళ సలహా కోసం వెళుతున్నాడు. 
 
అక్రమాస్తుల కేసులో ఇప్పటికే బెంగుళూరులోని పరప్పణ జైలులో ఊచలు లెక్కిస్తున్న శశికళకు పళణిస్వామి అత్యంత సన్నిహితుడు. జైలుకు వెళ్ళేదాని కన్నా ముందు శశికళ తాను నమ్మినబంటు పళణికి సిఎం పదవి లభించేలా పావులు కదిపింది. మొదట్లో శశికళను దేవతగా భావించిన పళణి ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కేంద్రానికి దగ‌్గరైపోయాడు. తన అల్లుడు దినకరన్‌ను ఉప ఎన్నికల్లో గెలిపించి ముఖ్యమంత్రి చేయాలనుకున్న శశికళ ఆశకు తెరపడిన విషయం తెలిసిందే.
 
ముఖ్యమంత్రిగానే ఉండాలన్నది పళణి ఆలోచన. అందుకే పన్నీరుసెల్వం వేరే వర్గం పెట్టుకున్నా ఆయనతో కలిసేందుకు సిద్థమై సంప్రదింపులు జరిపారు. ఇదంతా జరుగుతుండగానే పళణి స్వామి వెంట ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశాడు దినకరన్. దీంతో పళణిస్వామి, పన్నీరుసెల్వంలు కేంద్రం వద్ద పంచాయతీ పెట్టారు. ఏకంగా ప్రధానమంత్రే పళణికి సలహాలు కూడా ఇచ్చి ఇద్దరు కలిసిపోండని సూచనలిచ్చారని సమాచారం. 
 
మరికొన్నిరోజుల్లోనే వీరు కలిసిపోతుండటంతో వారి మధ్య ఎలాగైనా విభేధాలు తీసుకురావడమో లేక అవిశ్వాసం పెట్టి పళణిస్వామిని ముఖ్యమంత్రిగా దించేయడమో లాంటివి చేయాలన్న ఆలోచనలో ఉన్నారు దినకరన్. అందుకే ఎలాంటి వ్యూహంతో వెళితే పళణిని, పన్నీరుసెల్వంను దెబ్బకొట్టచ్చన్న సలహాల కోసం శశికళ వద్దకు వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు దినకరన్. ఈ రోజు సాయంత్రం, లేకుంటే రేపు లోగా శశికళను దినకరన్ కలవనున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి... దినకరన్‌కు ఎలాంటి సలహాలను శశికళ ఇస్తుందో..?