ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: సోమవారం, 5 జూన్ 2017 (18:30 IST)

భళ్లాలదేవ కుర్చీలా గజగజలాడుతున్న పళనిస్వామి సీఎం పీఠం... దినకరన్ వెనుక 25 మంది ఎమ్మెల్యేలు

జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ వేగంగా పావులు కదుపుతున్నారు. పార్టీ వ్యవహారాల్లో తిరిగి తలదూర్చనని చెప్పిన దినకరన్ మళ్ళీ అదే పనిచేస్తున్నారు. ఆర్కే నగర్ ఎన్నికల వ్యవహారంలో ఏకంగా ఎన్నికల కమిషన్‌కే లంచం ఎరచూపి అడ్డంగా దొరి

జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ వేగంగా పావులు కదుపుతున్నారు. పార్టీ వ్యవహారాల్లో తిరిగి తలదూర్చనని చెప్పిన దినకరన్ మళ్ళీ అదే పనిచేస్తున్నారు. ఆర్కే నగర్ ఎన్నికల వ్యవహారంలో ఏకంగా ఎన్నికల కమిషన్‌కే లంచం ఎరచూపి అడ్డంగా దొరికిపోయిన దినకరన్ ఊచలు లెక్కించాడు. జైల్లోకి వెళ్ళక ముందు ఇక పార్టీకి దూరంగా ఉంటానని, పార్టీ వ్యవహారాలను అస్సలు పట్టించుకోనని చెప్పాడు. ఆ తరువాత పళణిస్వామి, పన్నీరుసెల్వంలు ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే గత నాలుగురోజుల  ముందు దినకరన్‌కు బెయిల్ వచ్చి విడుదలయ్యాడు. రావడం..రావడంతోనే మళ్ళీ అన్నాడిఎంకే పార్టీపై దృష్టి పెట్టాడు.
 
చింతచచ్చినా పులుపు చావదన్నట్లు.. రాజకీయాల్లోకి ఒకసారి వచ్చిన తరువాత ఇంకా వెనుతిరగడమన్నది సాధ్యం కాదనేది అందరికీ తెలిసిందే. అందులోను పార్టీలో కీలకంగా ఉంటే అస్సలు మనసొప్పదు. ఆరోపణల మీదో, లేకుంటే ఏదైనా కారణాల వల్ల జైలుకు వెళ్ళి తిరిగి వచ్చినా రాజకీయాలను మాత్రం వదలరు. అలాంటి పరిస్థితే శశికళ మేనల్లుడు దినకరన్ ఎదుర్కొంటున్నారు. పార్టీకి దూరంగా ఉంటానని చెబుతూనే మళ్ళీ దానిపైనే దృష్టి పెట్టారు. 
 
అన్నాడిఎంకే.. పళణిస్వామి వర్గంలోని 25 మంది ఎమ్మెల్యేలతో రహస్యంగా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. తన ఇంటిలో నిన్న రాత్రి సుధీర్ఘంగా ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు దినకరన్. పార్టీ పరిస్థితి.. తమిళనాడులో నెలకొన్న రాజకీయాలపై సుధీర్ఘంగా మాట్లాడారు. ఇప్పటికే దినకరన్ బయటకు రావడంతో ఆందోళన చెందుతున్న పళణిస్వామి.. తన వర్గంలోని ఎమ్మెల్యేలు దినకరన్‌తో సమావేశమయ్యారని తెలియడంతో ఏం చేయాలో అర్థంకాక ఆలోచనలో పడ్డారు. 
 
దినకరన్ వ్యూహం చూస్తుంటే మళ్ళీ పార్టీ పగ్గాలు చేపట్టి అన్నాడిఎంకేను తన చేతుల్లోకి తీసుకుంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ... దినకరన్ మాత్రం రాజకీయ నాయకులు చెప్పే డైలాగులే చెప్తున్నారు. చిన్నమ్మ శశికళ ప్రస్తుతానికి పార్టీని పటిష్టపరిచడంపైనే దృష్టి సారించాలని తనతో చెప్పినట్లు వినిపిస్తున్నారు. మరి పార్టీ ఎవరి చేతుల్లో ఉందబ్బా అని తమిళజనం అయోమయంలో వున్నారు.