శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : మంగళవారం, 6 డిశెంబరు 2016 (15:43 IST)

ప్రధాని మోడీ చేతిలో అన్నాడీఎంకే భవితవ్యం.. పావులు కదుపుతున్న బీజేపీ? శశికళ - పన్నీర్‌లతో టచ్

తమిళనాడులో ఓ రాజకీయ శకం ముగింది. మఖ్యమంత్రిగా జనరంజకమైన పాలన అందించి, అన్నాడీఎంకేను తన కనుసైగలతో గుప్పెట్లో పెట్టుకున్న ధీరవనిత జయలలిత ఇకలేరు. దీంతో పార్టీతో పాటు.. తమిళనాడు వాసులు కూడా జయలలిత మృతిని

తమిళనాడులో ఓ రాజకీయ శకం ముగింది. మఖ్యమంత్రిగా జనరంజకమైన పాలన అందించి, అన్నాడీఎంకేను తన కనుసైగలతో గుప్పెట్లో పెట్టుకున్న ధీరవనిత జయలలిత ఇకలేరు. దీంతో పార్టీతో పాటు.. తమిళనాడు వాసులు కూడా జయలలిత మృతిని జీర్ణించుకోలేపోతున్నారు. ముఖ్యంగా.. జయలలిత లేని తమిళనాడును వారు ఊహించుకోలేక పోతున్నారు. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జయలలిత మరణాన్ని తమకు అనుకూలంగా మలచుకునేందుకు భారతీయ జనతా పార్టీ నేతలు వ్యూహాలు కదుపుతున్నారు. తద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడులో తన ప్రాబల్యాన్ని పెంచుకొనేందుకు ఇదే సువర్ణావకాశంగా కమలనాథులు భావిస్తున్నారు.
 
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తమిళనాడులో ప్రాబల్యం కోసం ఆ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. అయితే జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆమెతో ఆ పార్టీ సన్నిహిత సంబంధాలను నెరిపింది. జయలలిత ఆసుపత్రిలో చేరిన తర్వాత ఆమె ఆరోగ్యంపై బీజేపీ నాయకులు ఎప్పటికప్పుడు ఆరా తీశారు... నిరంతరం రాష్ట్ర పరిస్థితులను తెలుసుకుంటూ ఏడీఎంకే నేతలతో టచ్‌లో ఉంటూ వచ్చారు.
 
నిజానికి అన్నాడీఎంకేలో స్వర్గీయ ఎంజీఆర్ తర్వాత అంతటి జనాకర్షణ కలిగిన నాయకురాలిగా జయలలిత ఎదిగారు. ఎంజిఆర్ బతికున్న కాలంలోనే ఆమె పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అయితే ఆమె పార్టీలో ప్రవేశాన్ని కొందరు సీనియర్లు వ్యతిరేకించారు. అయితే ఎంజిఆర్ మాత్రం ఆమెకు మద్దతిచ్చేవారు. ఎంజిఆర్ మరణం తర్వాత ఆమె అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. 1989లో ప్రతిపక్ష నాయకురాలిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 1991 నుండి చనిపోయేవరకు పార్టీలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. అన్నీ తానై పార్టీని ఆమె నడిపించారు. 
 
పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీ వ్యవహారాల్లో ఆమె తర్వాత స్థానం అనే విషయమై ఇంతవరకు చర్చే జరగలేదు. ఆమె చనిపోయిన తర్వాత ఆమె తర్వాతి స్థానం కోసం వెతికే పరిస్థితి ఏర్పడింది. రాజకీయంగా ఈ పరిణామం పార్టీకి కొంత ఇబ్బందులను కల్గించే పరిస్థితి. అందుకే ఆమె ఇంట్లో ఉన్నా... జైల్లో ఉన్నా... ఆసుపత్రిలో ఉన్న ఆమె తర్వాత స్థానం విషయమై పార్టీ నాయకుల్లో పెద్దగా చర్చించలేదు. 
 
ఎంజిఆర్ మరణం తర్వాత ఆయన సతీమణి జానకీ రామచంద్రన్ సీఎంగా బాధ్యతలను నిర్వహించినా పార్టీపై పట్టును సాధించలేకపోయారు. 1991లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె పార్టీపై పూర్తి ఆధిపత్యాన్ని సాధించారు. సీనియర్లను కూడా తన అదపులో కనుసైగలతో శాసించారు. పార్టీలో తాను చెప్పిందే వేదంగా మారేలా వ్యూహాలను అమలుచేశారు. పార్టీలో నెంబర్ 2 అనే స్థానం ఉంటే పార్టీ పురోభివృద్ధికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని భావించి తన డిక్షనరీలో నంబర్ 2 అనే సంఖ్యకు తావులేదని తన చేష్టల ద్వారా నిరూపించారు. 
 
అక్రమాస్తుల కేసులో అనివార్య పరిస్థితుల్లో జైలుకెళ్లాల్సిన పరిస్థితుల్లో తనకు అత్యంత నమ్మకస్తుడైన పన్నీర్‌ సెల్వంకు సీఎం పగ్గాలు అప్పగించారు. ఆసుపత్రిలో ఉన్న సమయంలో కూడ తాత్కాలిక ముఖ్యమంత్రిగా సెల్వం బాధ్యతలను నిర్వహించారు. అయితే జయ చనిపోయిన తర్వాత పన్నీరు సెల్వం ఆయన మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసింది. అదేసమయంలో జయను ఎల్లవేళలా నీడలా వెన్నంటి ఉండే శశికళ కూడ పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకొనేవారు కాదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడ ఆమె ఆరోగ్యం అంతగా బాగా లేకున్నా ఆమె మాత్రం బాధ్యతలను ఇతరులకు అప్పగించలేదు. రాష్ట్రంలో సుడిగాలి పర్యటన జరిపి... ఒంటిచేత్తో వరుసగా రెండోసారి అధికారపీఠాన్ని అధిరోహించారు.
 
అయితే, జయలలిత మరణానికి ముందు.. మరణం తర్వాత జరిగే పరిణామాలన్నీ నిశితంగా పరిశీలిస్తున్న బీజేపీ... తమిళనాడు రాష్ట్రంలో ప్రాబల్యం పెంచుకొనే దిశగా అడుగులు వేస్తోంది. దక్షిణాదిలో ఆ పార్టీకి అంతగా ప్రాబల్యం లేకపోవడం... తమిళనాడులో జయలలిత మరణంతో ఆ పార్టీని సమర్థవంతంగా నడిపించే నాయకుడు ఎవరూ లేకపోవడం కొంత ఇబ్బందిగా మారింది. అయితే ఈ అవకాశాలను ఉపయోగించుకొని బీజేపీ ప్రాబల్యం కోసం ఎత్తులు వేస్తోంది. బీజేపీ నాయకులు కూడా పన్నీరు సెల్వంతో టచ్‌లో ఉంటున్నారు.