పాత్ర కోసం జుట్టు పొట్టిగా కత్తిరించుకున్న సాయిపల్లవి
కోలీవుడ్ నటుడు ధనుష్ - సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం 'ఓ.ఎం'. మలయాళ మెగాస్టార్ మమ్మూట్టి కీలక పాత్రను పోషిస్తున్నారు. రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకుడు. తిరుపతి - తిరువణ్ణామలై ప్రాంతాల మధ్య ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ నెల 20వ తేదీన విడుదలకానుంది. ఇందులో ఐపీఎస్ అధికారిణి నిత్యా రెడ్డి పాత్రను సాయిపల్లవి పోషించారు. ఈ సినిమాలో అచ్చమైన పోలీస్ అధికారిణిగా కనిపించేందుకు సాయిపల్లవి తన జుత్తును పొట్టిగా కత్తిరించుకున్నారట. ఆ విషయం తెలిసి తన తల్లిదండ్రులు షాక్ తిన్నట్లు సాయిపల్లవి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
'నేను జుత్తు కత్తిరించుకున్న తర్వాత మా అమ్మకు వీడియో కాల్ చేశాను. నా షార్ట్ హెయిర్ చూసి ఆమె షాకయ్యారు. వెంటనే కోపంతో కాల్ కట్ చేశారు. ఆ తర్వాత మా నాన్న విగ్ పెట్టుకున్నావా అని అడిగితే, నిజంగానే జుత్తు కత్తిరించుకున్నానని చెప్పాను. దీంతో ఆయన మా అమ్మకు సర్దిచెప్పడానికి కొన్ని రోజులపాటు కష్టపడాల్సి వచ్చింది.
ఆ తర్వాతే మళ్లీ అమ్మ నాతో మాట్లాడటం మొదలుపెట్టింది. వేరే డైరెక్టర్ అడిగి ఉంటే నేను షార్ట్ హెయిర్‌కు ఒప్పుకొనేదాన్ని కాదు. రాజ్‌కుమార్ పెరియస్వామి అడగడం వల్లే అంగీకరించాను. ఆయన నా పాత్ర రిఫరెన్స్ కోసం ఐపీఎస్ అధికారిణి మెరిన్ జోసెఫ్ ఫొటో చూపించారు అని సాయిపల్లవి వివరించారు.

