అక్కడకు మైక్‌తో వెళ్లకండి.. వెళ్లినా తలకు హెల్మెట్ పెట్టుకోండి : మంచు మనోజ్
సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. ఇందులోభాగంగా, వచ్చే ఎన్నికల్లో ఆయన తన భార్యను ఎన్నికల్లో పోటీకి దించనున్నారు. ఇందులోభాగంగానే ఆయన ఇటీవల ఐక్య ధైర్య సేన సమితిని ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో తన సేవా కార్యక్రమాలను విస్తరించారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తన భార్య మౌనిక పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు.
మే 20వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా నేడు మీడియాతో మనోజ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఐక్య గురించి మాట్లాడారు. ఇది రాజకీయ సంస్థ కాదన్నారు. రాజకీయాలకు ఈ సంస్థకూ ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రజల గొంతుకగా ఉండేందుకు దీన్ని ప్రారంభించినట్లు చెప్పారు.
దీని కార్యకలాపాల కోసం సొంత నిధులనే వెచ్చించనున్నట్లు తెలిపారు. అలాగే, తన సతీమణి మౌనిక వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని వెల్లడించారు. ప్రస్తుతం రాజకీయాల్లో భాగమయ్యామని స్పష్టం చేశారు. మీ నాన్నతో ఉన్న గొడవలు సద్దుమణిగాయా? అని అడగ్గా.. అది ఎవరిని అడగాలో మీకు తెలుసు. కానీ, మైక్‌తో వెళ్లకండి. వెళ్లినా హెల్మెట్ పెట్టుకోండి అని సరదాగా చెప్పారు.
