శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: బుధవారం, 1 మార్చి 2017 (18:57 IST)

కమలా పండుతో కలిగే మేలు(Video)

న్యూమోనియా వ్యాధితో బాధపడేవారు, కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడేవారు ప్రతిరోజూ క్రమం తప్పకుండా కమలా పండును తిన్నట్లయితే ఆ సమస్యల నుంచి క్రమంగా బయటపడే అవకాశం ఉంది. కమలా పండులో లభించే క్యాల్షియం ఎముకలకు దృఢత్వాన్నిస్తుంది. ఈ పండులో అధిక మోతాదులో లభించే విటమ

న్యూమోనియా వ్యాధితో బాధపడేవారు, కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడేవారు ప్రతిరోజూ క్రమం తప్పకుండా కమలా పండును తిన్నట్లయితే ఆ సమస్యల నుంచి క్రమంగా బయటపడే అవకాశం ఉంది. కమలా పండులో లభించే క్యాల్షియం ఎముకలకు దృఢత్వాన్నిస్తుంది. ఈ పండులో అధిక మోతాదులో లభించే విటమిన్ 'ఎ' వల్ల దృష్టి లోపాలను నివారిస్తుంది. కమలా పండులో మాంసకృత్తులు, పిండి పదార్థాలు, పీచుతోపాటు ఖనిజ లవణాలైన క్యాల్షియం, ఫాస్పరస్, ఇనుము, సోడియం, పొటాషియం పుష్కలంగా లభిస్తాయి. ఇందులోని ఏ, సీ విటమిన్లతో పాటు థయామిన్, నియాసిన్, రైబోఫ్లేవిన్ తదితరాలు మెండుగా ఉంటాయి.
 
కమలాఫలం నేరుగా తినడం వల్ల జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్‌లు అధికంగా ఉత్పత్తి అవుతాయి. ఫలితంగా జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. కమలాఫలం రసానికి,వేపాకుల పొడి కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుని కడిగేస్తే మొటిమలు, మచ్చలు తగ్గి చర్మం కాంతివంతం అవుతుంది. దీని తొక్కలను ఎండబెట్టి పొడిచేస్తే చక్కని సౌందర్య సాధనంగా ఉపయోగపడుతుంది. 
 
కమలా పండు రసాన్ని స్నానం చేసే నీటిలో కలిపితే శరీర దుర్వాసన మాయమవుతుంది. కమలా రసంలో కొంచెం నీరు కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే మృతకణాలు దూరమవుతాయి. ఈ పొడికి కొంచెం శెనగపిండి చేర్చితే చక్కని నలుగులా పనిచేస్తుంది. ముఖం, చేతులు తాజాదనం సంతరించుకోవాలంటే కమలాఫలం గుజ్జును నేరుగా లేదా కొంచెం తేనె కలిపి రాసుకుంటే సరిపోతుంది.
 
క్షయ, ఉబ్బసంతో బాధపడేవారు ప్రతిరోజూ క్రమం తప్పకుండా కమలా పండును ఆహారంలో భాగంగా తీసుకున్నట్లయితే ఆయా సమస్యల నుంచి క్రమంగా దూరమవవచ్చు. అలాగే మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడకుండా, శరీరంలో కొవ్వు స్థాయిని తగ్గించటంలోనూ కమలా పండు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. కమలా పండులోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని కణాలు నశించకుండా చూస్తాయి. ఫోలిక్ ఆమ్లం మెదడు పని తీరును మెరుగుపరచి చురుకుగా ఉంచుతుంది. 
 
జలుబు, దగ్గుతో బాధపడేవారు విటమిన్ సీ అధికంగా ఉండే కమలా పండు రసం తాగినట్లయితే సమస్య తగ్గుముఖం పడుతుంది.కమలా పండులో లభించే విటమిన్ సీ దంత సంబంధ వ్యాధులను అరికట్టడంలోనూ ఎంతగానో సహకరిస్తుంది. శరీరం నీరసంగా ఉన్నప్పుడు కమలా రసం తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఇందులో అధికంగా ఉండే చక్కెర శరీరానికి సత్వర శక్తిని ఇస్తుంది. మలబద్ధకం, తలనొప్పితో బాధపడేవారు ఈ రసంలో ఉప్పు కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది. తేనె కలిపి తీసుకుంటే గుండె సంబంధ వ్యాధులు అదుపులో ఉంటాయి.