అసెంబ్లీ సవ్యంగా జరిగేలా చూడు తండ్రీ... శ్రీవారి సేవలో స్పీకర్
రోజు అల్లర్లతో శాసనసభ అట్టుడికి పోతోంది తండ్రీ... నేను స్పీకర్ గా ఉన్నంత కాలం సభ సవ్యంగా ఉండేలా చూడు స్వామీ.. అంటూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు శుక్రవారం తెల్లవారు జామున తిరుమల శ్రీవారిని వేడుకున్నారు.
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆయన గురువారం రాత్రి పొద్దుపోయాక తిరుమలకు చేరుకున్నారు. శుక్రవారం వేకువ జామునే తిరుమల ఆలయం వద్దకు రాగానే సాంప్రదాయం ప్రకారం అధికారులు ఆయనకు స్వాగతం పలికారు.
ఆలయంలోని వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన ఆలయంలోపలే ఉన్న వకుళమాత దేవి, విమాన వెంకటేశ్వర స్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయనకు వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. జేఈవో శ్రీనివాస రాజు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
