1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 9 మే 2016 (10:41 IST)

పాకిస్థాన్‌లో హిందూ బాలుడిపై అత్యాచారం.. ఆపై హత్య...

పాకిస్థాన్‌లో ఓ దారుణం జరిగింది. ఆడుకోవడానికి వెళ్లిన 11 యేళ్ల బాలుడిపై అత్యాచారం జరిపి.. ఆపై హత్య చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జరిగిన నెల రోజులు అయింది. కానీ, ఇప్పటివరకు ఆ దేశ పోలీసులు లేదా.. బాలుడు హత్యకు గురైన క్లబ్ యజమాని కూడా స్పందించక పోవడం గమనార్హం. ఈ బాలుడు ఓ డాక్టర్ కుమారుడు కావడం గమనార్హం. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
సింధ్‌ ప్రావిన్స్‌లో చేతన్‌ అనే భారతీయుడు వైద్యుడుగా పనిచేస్తున్నారు. 11 ఏళ్ల కుమారునితో కలిసి గత నెల 13వ తేదీన హైదరాబాద్‌ క్లబ్‌కు వెళ్లారు. ఆడుకొంటుండగా, ఉన్నట్టుండి కనిపించకుండా పోయాడు. దీనిపై చేతన్ ఫిర్యాదు మేరకు... పోలీసులు, క్లబ్‌ యాజమాన్యంతో కలిసి గాలించగా, స్విమ్మింగ్‌ఫూల్‌లో మృతదేహం కనిపించింది. 
 
మృతదేహంపై తీవ్ర గాయాలు ఉన్నాయి. అసలు అది తమ బిడ్డ మృతదేహమేనా అని తల్లిదండ్రులు సందేహించేలా మృతదేహంపై గాయాలు ఉన్నాయి. ముఖమంతా గాయాలు, శరీరమంతా గాట్లతో స్విమ్మింగ్‌ ఫూల్‌లో తేలియాడుతూ కనిపించడంతో తమ బిడ్డపై అత్యాచారం జరిపి, ఆ తర్వాత హత్య చేశారని పాకిస్థాన్‌లోని ఆ హిందూ దంపతులు ఆరోపిస్తున్నారు. 
 
దారుణం జరిగిపోయిన ఆ గంట ఏమి జరిగిందనేది తెలుసుకోవడం కోసం.. తమకు సీసీ కెమెరాల రికార్డులను చూపించాలని బాధిత కుటుంబం క్లబ్‌ యాజమాన్యాన్ని ఎంత కోరినా స్పందన లేదు. ఘటన జరిగి దాదాపు నెల రోజులు అవుతున్నా క్లబ్‌ యాజమాన్యం గానీ, పోలీసులు గానీ తమకు సహకరించడం లేదని బాలుడి తండ్రి చేతన్‌ కుమార్‌ ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబానికి హిందూ పంచాయతీ కార్యకర్తలు సహా పలు సంస్థలు మద్దతుగా నిలుస్తున్నాయి.