అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం - ముగ్గురి మృతి
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. ఫిలడెల్ఫియాలోని సౌత్ స్ట్రీట్‌లో శనివారం రాత్రి ఈ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో పదకొండు మంది గాయపడ్డారు. మృతుల్లో ఓ మహిళ కూడా ఉన్నారు.
ఘటనా స్థలంలో రెండు హ్యాండ్ గన్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ కాల్పులకు పాల్పడిన వారిని పోలీసులు ఇంకా అరెస్టు చేయలేదు. పైగా, కాల్పుల ఘటన జరిగిన వెంటనే పోలీసులు అప్రమత్తమై తక్షణం ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని స్థానికులకు ట్విటర్ ద్వారా హెచ్చరికలు చేశారు. దీంతో ఆ ప్రాంతం నుంచి ప్రజలను ఖాళీ చేయించారు.
గుర్తుతెలియని వ్యక్తులు, పోలీసుల ప్రకారం, డౌన్‌టౌన్ ఫిలడెల్ఫియాలోని సౌత్ స్ట్రీట్ పరిసరాల్లో గుమిగూడిన జనంపై కాల్పులు జరిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సౌత్ స్ట్రీట్‌లో పెద్ద జనసమూహం ఉన్న సమయంలో దుండగుడు ఈ కాల్పులకు తెగబడ్డాడని పేర్కొన్నారు. కాగా, ఇటీవలి కాలంలో వరుసగా కాల్పుల ఘటనలు జరుగుతున్న విషయం తెల్సిందే.