ఢాకా రెస్టారెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం... 44 మంది మృత్యువాత
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఢాకాలోని ఏడు అంతస్తుల రెస్టారెంట్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో కనీసం 44 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. మరో 40 మందికిపైగా గాయపడ్డారు. ప్రమాద సమయం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, అగ్నిమాపకదళం రంగంలోకి రెస్టారెంట్‌లో చిక్కున్న మరో 75 మంది ప్రాణాలతో రక్షించారు. ఈ అగ్నిప్రమాదం గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే సంభవించినట్టు తెలుస్తుంది.
ఢాకా బెయిలీ రోడ్డులోని ఓ బిర్యానీ రెస్టారంట్‌లో గురువారం రాత్రి మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక విభాగం అధికారి మహమ్మద్ షిహబ్ వెల్లడించారు. క్రమంగా పై అంతస్తులకు విస్తరించినట్లు తెలిపారు. రెండు గంటల్లో మంటలను అదుపులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో రెస్టారంట్లు, వస్త్ర దుకాణాలు, మొబైల్ ఫోన్ల విక్రయ కేంద్రాలు అధికంగా ఉన్నాయి.
'మేం ఆరో అంతస్తులో ఉన్నాం. మెట్ల మార్గంలో పొగ వస్తుండడం గమనించాం. అందరూ కింది నుంచి పైకి పరుగెత్తుకొచ్చారు. మేమంతా నీటి పైపుల ద్వారా కిందకు దిగాం. కొందరు పై నుంచి దూకటంతో తీవ్ర గాయాలయ్యాయి. కొంత మంది పూర్తిగా భవనం పైకి చేరుకున్నారు. సాయం కోసం అర్థించారు' అని రెస్టారంట్ మేనేజర్ సోహెల్ తెలిపారు.
బంగ్లాదేశ్‌లో అపార్ట్‌మెంట్లు, ఫ్యాక్టరీ కాంప్లెక్సుల్లో అగ్ని ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. 2021 జులైలో ఓ ఆహార శుద్ధి పరిశ్రమలో చెలగరేగిన మంటల్లో అనేక మంది పిల్లలు సహా 52 మంది దుర్మరణం చెందారు. 2019 ఫిబ్రవరిలో రాజధాని ఢాకాలో అపార్ట్‌మెంట్ బ్లాకుల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 70 మంది మృతి చెందారు.