ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 28 మార్చి 2017 (12:19 IST)

గిల్గిట్-బాల్తిస్థాన్‌ను మా దేశంలో కలుపుకుంటామన్న పాక్- ఆ పప్పులుడకవ్.. భారత్ వార్నింగ్

కాశ్మీర్‌లో ఆక్రమించిన గిల్గిట్‌–బాల్తిస్థాన్‌‌ను ఐదో రాష్ట్రంగా కలుపుకునేందుకు పాకిస్థాన్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇందుకోసం రాజ్యాంగ సవరణకు సైతం పాకిస్థాన్ సిద్ధమవుతోంది. అయితే పాకిస్థాన్ చర్యలపై జమ్

కాశ్మీర్‌లో ఆక్రమించిన గిల్గిట్‌–బాల్తిస్థాన్‌‌ను ఐదో రాష్ట్రంగా కలుపుకునేందుకు పాకిస్థాన్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇందుకోసం రాజ్యాంగ సవరణకు సైతం పాకిస్థాన్ సిద్ధమవుతోంది. అయితే పాకిస్థాన్ చర్యలపై జమ్మూకాశ్మీర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో నిరసలు వెల్లువెత్తాయి. ఇప్పటికే అది భారత్‌కు చెందిన ప్రాంతమని బ్రిటన్ పార్లమెంట్‌లో తీర్మానం ప్రవేశపెట్టిన తరుణంలో గిల్గిట్-బాల్తిస్థాన్‌లను పాక్ తమ దేశంలో కలుపుకునేందుకు అత్యుత్సాహం చూపుతోంది. 
 
ఇందులో భాగంగా ఏడు దశాబ్ధాలుగా తమ దేశానికి అనుబంధ ప్రాంతంగా పాకిస్థాన్ ఆధీనంలో ఉంచుకున్న గిల్గిట్-బాల్తిస్థాన్ ప్రాంతానికి ప్రావిన్స్ హోదా ఇవ్వాలని పాక్ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్‌ అజీజ్‌ నేతృత్వంలోని కమిటీ ప్రతిపాదించినట్లు పాక్‌ అంతర్రాష్ట్ర వ్యవహారాల మంత్రి రియాజ్‌ హుస్సేన్‌ పీర్జాదా గత వారంలో ప్రకటించారు. ఆ ప్రాంతపు హోదా మార్చి రాష్ట్రంగా చేయడం కోసం రాజ్యాంగ సవరణ చేపడతామని కూడా రియాజ్ ప్రకటించారు. 
 
కాగా ఇప్పటికే పాకిస్థాన్‌లో ప్రస్తుతం బలూచిస్తాన్‌, ఖైబర్‌ పఖ్తూన్‌ఖ్వా, పంజాబ్‌, సింధ్‌ అనే నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ప్రస్తుతం కాశ్మీర్‌లో ఆక్రమించుకున్న ప్రాంతమైన గిల్గిట్-బాల్తిస్థాన్‌ను ఐదో రాష్ట్రంగా కలుపుకునేందుకు పాకిస్థాన్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు చైనా కారణమని కూడా వార్తలు వస్తున్నాయి. గిల్గిట్-బాల్తిస్థాన్ భూభాగం నుంచి చైనా-పాక్ ఆర్థిక కారిడార్‌ను విస్తరిస్తుంది. ఇందుకే ఈ భూభాగంలో సీపెక్‌కు చట్టబద్ధత కల్పించడం కోసం రాజ్యాంగ సవరణ చేసేందుకు పాకిస్థాన్ రెడీ అవుతోంది. 
 
అయితే భారత్‌లో అంతర్భాగమైన భూభాగాన్ని పాకిస్థాన్ ఆక్రమించుకోవడంతో పాటు.. ఆ భూభాగంలో మూడో దేశం చైనా ఆర్థిక కారిడార్‌ నిర్మాణ పనులు చేపడుతుండం పట్ల భారత్‌ ఇప్పటికే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. జమ్మూకాశ్మీర్ ప్రాంతం మొత్తం 1947లో భారత్‌లో విలీనమైందనే విషయాన్ని పాకిస్థాన్ గుర్తు పెట్టుకోవాలని.. అయితే జమ్మూలోని కొంతభాగం పాకిస్థాన్ ఆక్రమణలో ఉందని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి గోపాల్ బగాలే తెలిపారు. 
 
అయితే గిల్గిట్‌-బాల్తిస్థాన్‌ ప్రాంతం హోదాను మార్చడానికి ఎటువంటి ప్రయత్నాలూ చెల్లవు. వాటిని అంగీకరించే ప్రసక్తే లేదని బగాలే స్పష్టం చేశారు. గిల్గిట్ ప్రాంతాన్ని పాక్ తమ దేశంలో కలుపుకోవాలనుకుంటే.. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌తో పాటు గిల్గిట్‌ను కూడా పాక్ ఆక్రమణ నుంచి విముక్తిని చేస్తామని కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ ఉద్ఘాటించారు. అలాగే జమ్మూకాశ్మీర్‌ను తన వాస్తవ రూపంలోకి తీసుకొచ్చి భారత సమాఖ్య విలీనం చేస్తామని ప్రకటించారు.