సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 25 జూన్ 2017 (17:57 IST)

పాక్‌లో రంజాన్‌ వేళ విషాదం : 140 మంది ప్రాణాలు తీసిన ఆయిల్ ట్యాంకర్

పాకిస్థాన్‌లో ఘోరం జరిగింది. ఓ ఆయిల్ ట్యాంకర్ 140 మంది ప్రాణాలు తీసింది. బహవల్‌పూర్‌ ప్రాంతంలో జాతీయ రహదారిపై ఓ ఆయిల్‌ ట్యాంకర్‌ బోల్తా పడి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 140 మందికిపైగా సజీవదహనమయ్యారు. మర

పాకిస్థాన్‌లో ఘోరం జరిగింది. ఓ ఆయిల్ ట్యాంకర్ 140 మంది ప్రాణాలు తీసింది. బహవల్‌పూర్‌ ప్రాంతంలో జాతీయ రహదారిపై ఓ ఆయిల్‌ ట్యాంకర్‌ బోల్తా పడి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 140 మందికిపైగా సజీవదహనమయ్యారు. మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. 
 
జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్‌ బోల్తా పడడంతో భారీగా ఇంధనం లీకయింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలంతా బకెట్లతో ఇంధనం తోడుకోవడానికి ఘటనాస్థలికి వచ్చారు. ఇంతలో ట్యాంకర్‌ పేలిపోవడంతో అక్కడున్నవారంతా దుర్మరణం చెందారు. 
 
వెంటనే ఘటనాస్థలికి చేరుకుని అగ్నిమాపక శకటాలతో సిబ్బంది మంటలను అదుపుచేశారు. క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. స్థానికులు ఆయిల్‌ తోడుకుంటుండగా.. ఓ వ్యక్తి సిగరెట్‌ తాగడంతో ఈ భారీ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.
 
 
ఇదిలావుండగా, రంజాన్ పండుగ సమయంలో శనివారం జరిగిన జంట పేలుళ్ళలో 18 మంది మృతి చెందిన విషయం తెల్సిందే. 100 మంది గాయాలపాలయ్యారు. పాక్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఉండే కుర్రం జిల్లాలోని పరచినార్ గిరిజన ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. 
 
మొదటి బాంబు పేలుడు.. పరచినార్ ఏజెన్సీ ప్రాంతంలోని అక్బర్ ఖాన్ మార్కెట్ లో సంభవించింది. రంజాన్ మాసం కావడంతో షాపింగ్ నిమిత్తం అక్కడికి వచ్చిన ప్రజలతో ఆ ప్రాంతం కిటకిటలాడుతున్న తరుణంలో ఈ దారుణం జరిగినట్టు అధికారులు తెలిపారు. 
 
మొదటి బాంబు పేలుడులో గాయపడ్డవారిని కాపాడేందుకు కొంత మంది వెళ్లిన సందర్భంలో రెండో బాంబు పేలింది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు.