సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 నవంబరు 2020 (16:29 IST)

నకిలీ పత్రాలతో లైసెన్సులు.. పాక్ పైలెట్ల నిర్వాకం : ఐసీఏఓకు వార్నింగ్!

పాకిస్తాన్ దేశ పైలెట్లు మరోమారు మోసానికి పాల్పడ్డారు. నకిలీ పత్రాలు సమర్పించి లైసెన్సులు పొందారు. ఈ విషయం గత ఆగస్టులోనే వెల్లడైంది. ఈ దేశ వ్యాప్తంగా మొత్తం 262 మంది నకిలీ పత్రాలు సమర్పించి లైసెన్సులు పొందగా, అందులో 146 మంది పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన పైలెట్లు ఉండటం గమనార్హం. 
 
దీనిపై అంతర్జాతీయ పౌర వియానయాన సంస్థ (ఐసీఏఓ) దృష్టి సారించడమేకాకుండా, నకిలీ పత్రాలతో లైసెన్సులు పొందిన పైలట్లతో విమానాలు నడపడం పట్ల పాక్‌ను తీవ్రంగా హెచ్చరించింది. అంతర్జాతీయ శిక్షణ ప్రమాణాలను పాటించడంలో పాకిస్థాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (పీసీఏఏ) విఫలమైందని స్పష్టం చేసింది.
 
ఐసీఏఓ హెచ్చరికల నేపథ్యంలో 188 దేశాలు పాక్ విమానాలను నిషేధించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే యూరోపియన్ యూనియన్ దేశాలు పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ విమానాలపై నిషేధం విధించిన విషయం తెల్సిందే. ఇపుడు మరికొన్ని దేశాలు కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచన చేస్తున్నాయి. 
 
పీఐఏ విమానాలపైనే కాకుండా, పాక్ పైలెట్లు నడిపే ఏ విమానం తమ గగనతలంలో ఎగరకుండా నిషేధించేందుకు ఆయా దేశాలు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై పాకిస్థాన్ ఎయిర్ లైన్స్ పైలెట్ల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమపై నిషేధం విధిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తోంది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని పైలెట్ల సంఘం కోరుతోంది.