మనమెందుకు తన్నుకోవాలి... మోడీతో ఛాయ్ అమ్మిద్దాం.. హుస్సేన్‌తో వడ చేయిద్ధాం... పాక్ హాస్యనటుడు ట్వీట్
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాకిస్థాన్ దేశానికి చెందిన హాస్య నటుడు షెహజాద్ ఘియాస్ షేక్‌య ఆసక్తికర ట్వీట్ చేశాడు. అందేంటంటే... భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యు
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాకిస్థాన్ దేశానికి చెందిన హాస్య నటుడు షెహజాద్ ఘియాస్ షేక్‌య ఆసక్తికర ట్వీట్ చేశాడు. అందేంటంటే... భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధమంటూ జరిగితే ఇరువైపుల భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరుగుతుంది. ఇలా ఎందుకు జరగాలి అంటూ ప్రశ్నించాడు.
అంతేకాదండోయ్.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పాకిస్థాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్‌ల మధ్య వంట పోటీలు లేదా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, పాకిస్థాన్ నటీనటుల మధ్య యాక్టింగ్ పోటీలు పెట్టి మనం ఎంజాయ్ చేద్దామంటూ విచిత్ర కామెంట్ చేశాడు.
ఇంకా కావాలంటే సింగర్, సంగీత దర్శకులు హిమేష్ రేషమియా, తాహిర్ షాల మంచి పాటల కచేరీ నిర్వహిద్దామని, వాటిని ఆస్వాదిద్దామని ఆయన సూచించాడు. ఈ పోటీ ఇంకా రక్తి కట్టాలంటే రాహుల్ గాంధీ, బిలావల్ భుట్టో మధ్య స్పెల్ బీ పోటీలు పెడదామని సూచించాడు. పాక్ టీవీ నటి మీరా, బిగ్ బాస్ షో కంటెస్టెంట్ అస్మిత్ పటేల్ మధ్య గాఢమైన చుంబనం చూసి ఆనందిద్దామని పిలుపునిచ్చాడు.
ముఖ్యంగా, భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఛాయ్ అమ్మడంలో ఎంతో అనుభవం ఉందని ప్రపంచం అంతా చెప్పుకుంటోంది. పాకిస్థాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్‌ను దహీ బల్లా (పెరుగు, ఆలు, వడతో తయారు చేస్తారు. ఉత్తర భారతం, పంజాబ్‌లో ఫేమస్ డిష్) తయారు చేయడంలో మించినవారు లేరు. వీరిద్దరి మధ్య మంచి పోటీపెట్టి అంతర్జాతీయ ప్రతినిధులను ఆహ్వానించి రుచిచూపిద్దాం. అది వద్దంటే... షారుఖ్ ఖాన్, పాకిస్తాన్ సినీ నటుడు, దర్శకుడు సాహిర్ లోధి మధ్య యాక్టింగ్ పోటీ పెడదామని, అది చూసి ఆస్వాదిద్దామని చెప్పాడు.
చివరగా, "మనమధ్య కొట్లాడుకోవడాలు బంద్ చేద్దాం. మనం కలిసి ఇతరులతో గిల్లికజ్జాలు పెట్టుకుందాం. మనం మాత్రం గిల్లి దండ ఆడుకుందాం. మనం మాట్లాడుకుందాం, ఆటలాడుకుందాం" అంటూ ఆయన పిలుపునిచ్చాడు. ఈ ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.