అమెరికాలో మరో విషాదం : కూలిన ప్రైవేట్ జెట్... ఆరుగురు దుర్మరణం
అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవలి కాలంలో వరుస విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన్ అంతర్జాతీయ విమానాశ్రయం గగనతలంపై 64 మంది ప్రయాణికులతో కూడిన విమానం.. ల్యాండ్ అవుతున్న ఆర్మీకి చెందిన హెలికాఫ్టర్‌ను ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో మొత్తం ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దిగ్భ్రాంతికర ఘటన నుంచి అమెరికా పౌరులు ఇంకా తేరుకోకముందే తాజాగా మరో విమాన ప్రమాదం సంభవించింది.
ఫిలడెల్ఫియాలో ఓ ప్రైవేట్ జెట్ కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. జనావాసాలు, షాపింగ్ మాల్స్‌పై కూలడం వల్ల మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అమెరికా అధికారులు చెబుతున్నారు. లియర్ జెట్ 55కు చెందిన మెడికల్ ట్రాన్స్‌పోర్టు విమానం... ఆ దేశ కాలమానం ప్రకారం సాయంత్రం 6.06 నిమిషాలకు నార్త్ ఈస్ట్ ఫిలడెల్ఫియా ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ తీసుకుంది. 1600 అడుగుల ఎత్తుకు చేరుకున్న తర్వాత కొన్ని సెకన్లలోనే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఫ్లైట్ మొత్తం పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.