బుధవారం, 26 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (11:32 IST)

ఎయిర్‌పోర్టులో తప్పిన పెనుముప్పు .. విమానం నేలను తాకీతాకగానే మళ్లీ టేకాఫ్ చేసిన పైలెట్!! (Video)

flight
అమెరికాలోని షికాగో విమానాశ్రయంలో పెను ప్రమాదం క్షణాల్లో తప్పింది. ఒక విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో మరో విమానం రన్‌వేపైకి అడ్డంగా రావడంతో అప్రమత్తమైన పైలెట్ వెంటనే తన విమానాన్ని తిరిగి టేకాఫ్ చేశాడు. విమానం రన్‌వేను తాకీతాకగానే మళ్లీ కొన్ని క్షణాల్లోనే టేకాఫ్ చేశాడు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
ఒమాహా నుంచి బయలుదేరిన సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానం మంగళవారం ఉదయం 8.47 గంటలకు షికాగోలోని మిడ్ వే ఇంటర్నేషనల్  ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది. విమానాశ్రయంలోని రన్‌వే 31సీపై దిగుతుండగా ఇద్ రన్‌ వేపై ఛాలెంజర్ 350 ప్రైవేట్ జెట్ అడ్డంగా వెళుతోంది. చివరక్షణంలో ఈ జెట్‌ను గమనించిన సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ విమాన పైలెట్ కొన్ని క్షణాల్లోనే మళ్లీ టేకాఫ్ తీసుకున్నాడు. 
 
దీంతో రెండు విమానాలు ఢీకొనే ప్రమాదం తప్పింది. రెండో ప్రయత్నంలో సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానం క్షేమంగా దిగింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు.. సదరు ప్రైవేట్ జెట్ ఎలాంటి అనుమతి తీసుకోకుండా రన్‌వే పైకి వచ్చిందని ప్రాథమికంగా నిర్ధారించారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.