1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 జులై 2022 (18:31 IST)

బ్రిటన్ ప్రధానిగా ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు?

Rishi Sunak
బ్రిటన్ రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరింది. బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేశారు. ఇపుడు ఆ పదవికి పోటీపడుతున్నా వారిలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, సుధామూర్తి దంపతుల కుమార్తె అక్షత భర్త రిషి సునక్ పేరు బలంగా వినిపిస్తుంది. 
 
42 యేళ్ల రిషి సునక్ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. గత 2020లో బ్రిటన్ మంత్రివర్గంలో చోటుదక్కించుకుని సరికొత్త చరిత్ర సృష్టించాడు. బ్రిటన్ మంత్రివర్గంలో కీలకమైన ఆర్థికమంత్రి పదవిని చేపట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. అదేసమయంలో ప్రధాని జాన్సన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆర్థిక శాఖను సమర్థంగా నిర్వహించారు. ఇటీవల కరోనా సంక్షోభ సమయంలోనూ ఉద్యోగులు నష్టపోకుండా ఆయన తీసుకొచ్చిన ప్యాకేజీ సర్వత్రా ప్రశంసలు అందుకుంది. 
 
అయితే, ప్రధాని బోరిస్ జాన్సన్ చర్యల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సునక్.. తన పదవికి రాజీనామా చేశారు. సునక్ బాటలోనే మరికొంతమంది మంత్రులు తమతమ పదవుల నుంచి వైదొలిగారు. దీంతో ప్రధానమంత్రి పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. 
 
అదేసమయంలో ఇపుడు కొత్త ప్రధాని ఎవరన్నదానిపై చర్చ సాగుతోంది. అధికార కన్జర్వేటివ్ పార్టీతో పాటు తన మంత్రివర్గ సహచరుల్లో అనేక మంది రిషి సునక్‌కు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో ఆయన బ్రిటన్ కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.